- వికటిస్తున్న పీఎంపీల వైద్యం
- రెండు రోజుల్లో రెండు ఘటనలు
- ఒకరి మృతి, మరొకరి పరిస్థితి సీరియస్
సిద్దిపేట, వెలుగు: ప్రథమ చికిత్సకే పరిమితం కావాల్సిన ఆర్ఎంపీ, పీఎంపీలు గ్రామాల్లో ఇష్టారీతిన వైద్యం చేస్తున్నారు. రోగమొకటైతే మందు మరొకటి ఇస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. సిద్దిపేట జిల్లాలో రెండు రోజుల వ్యవధిలో వైద్యం వికటించిన రెండు సంఘటనల్లో ఒకరు మృతి చెందగా, మరొకరు మృత్యువుతో పోరాడుతున్నారు.
సాధారణ వ్యాధులకు సైతం హైడోస్ మందులు ఇవ్వడంతో వైద్యం వికటిస్తోంది. జిల్లా వ్యాప్తంగా దాదాపు రెండు వేల వరకు ప్రథమ చికిత్సాలయాలు ఉన్నాయి. సీజనల్ వ్యాధుల సమయంలో వీరికి విపరీతమైన డిమాండ్ ఏర్పడడమే కాకుండా కొందరు కార్పొరేట్‌ఆస్పత్రులకు రోగులను రిఫర్ చేస్తూ అందినకాడికి దోచుకుంటున్నారు.
గ్రామాల్లో పుట్టగొడుగుల్లా..
జిల్లా వ్యాప్తంగా గ్రామాల్లో ఫస్ట్‌ఎయిడ్ సెంటర్లు పుట్ట గొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. జిల్లాలో వైద్య ఆరోగ్య శాఖ అనుమతి పొందినవి 200 పై చిలుకుంటే ప్రస్తుతం వీటి సంఖ్య వేలల్లోకి చేరింది. అంతంత అనుభవం ఉన్న ఆర్ఎంపీ, పీఎంపీలు ఎంబీబీఎస్ డాక్టర్ల మాదిరి వ్యవహరిస్తున్నారు. ఇటీవల చేర్యాలలో ఓ వ్యక్తి కళ్లు తిరుగుతున్నాయని పీఎంపీ వద్దకు వెళ్తే రూ.3 వేల ఖర్చు చేసే పరీక్షలు నిర్వహించి స్కానింగ్ కోసం సిద్దిపేటకు పంపడం ఆశ్చార్యానికి గురిచేస్తోంది.
క్లినిక్‌ల పేరిట వెలిసిన ఆస్పత్రుల్లో కనీం ఇంజక్షన్, సెలైన్ సైతం పెట్టొద్దు కానీ ఇది ఎక్కడ అమలు జరుగుతున్న దాఖలాలు లేవు. కొన్ని మండల కేంద్రాల్లో క్లినిక్‌లకు అనుబంధంగా మెడికల్ షాపులు నిర్వహిస్తూ అధిక ధరలకు మందులు అమ్ముతున్నారు. ఇదిలా ఉంటే ఆర్ఎంపీ, పీఎంపీలతో కార్పొరేట్ఆస్పత్రులు ఒప్పందాలు చేసుకొని రోగులను రిఫర్ చేస్తే కమీషన్లు ఇస్తున్నారు.
అనుమతి లేని ల్యాబ్ ల ఏర్పాటు
ఇటీవల కాలంలో డెంగ్యూ, మలేరియా, వైరల్ ఫీవర్స్ పెరగడంతో గ్రామాల్లోని ఫస్ట్‌ఎయిడ్ సెంటర్లలో రద్దీ పెరుగుతోంది. పట్టణాల్లోని ఆస్పత్రులకు వెళ్తే పరీక్షలు, స్కానింగ్ ల పేరిట వేల రూపాయలు ఖర్చు చేయలేక అందుబాటులోని ఆర్ఎంపీ, పీఎంపీలతో చికిత్సలు చేయించుకుంటున్నారు. వీరిలో కొందరు తమ ఆస్పత్రులకు అనుబంధంగా ల్యాబ్ లు ఏర్పాటు చేసుకుని రక్త పరీక్షలు నిర్వహిస్తున్నారు. దుద్దెడ లో మహిళా రోగి సంఘటన జరిగిన తర్వాత వైద్య ఆరోగ్య శాఖ అధికారుల తనిఖీల్లో అనుమతి లేని ల్యాబ్ ను గుర్తించగా ఇలాంటివి ఇంకా అనేకం ఉన్నాయని తెలుస్తోంది.
Also Read : స్టీల్ బ్యాంక్‌లతో ప్లాస్టిక్ నిర్మూలన
కొండపాక మండలం అంకిరెడ్డిపల్లికి చెందిన తేలు మహేశ్వరి (40 ) జ్వరం, ఒంటి నొప్పులతో బాధపడుతూ దుద్దెడలోని ఒక పీఎంపీ వైద్యుడి వద్దకు వెళ్లింది. అతడు పరీక్షించి సెలైన్ పెట్టి అందులో రెండు ఇంజక్షన్లు కలిపి చికిత్స ప్రారంభించిన కొద్ది గంటల్లోనే ఆమె అపస్మార స్థితికి చేరుకుంది. రోగి పరిస్థితి విషమించిందని గమనించిన పీఎంపీ అక్కడి నుంచి జారుకోగా రోగి బంధువులు వెంటనే ఆమెను సిద్దిపేటలోని ఓ ప్రైవేట్‌ఆస్పత్రికి తీసుకెళ్లగా వారు హైదరాబాద్ కు రిఫర్ చేశారు.
ప్రస్తుతం అక్కడ ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మహేశ్వరి పరిస్థితి అత్యంత విషమంగా ఉందని సమాచారం. పీఎంపీ వైద్యుడు సరైన విధంగా చికిత్స చేయకపోవడమే ఇందుకు కారణమని తెలుస్తోంది.
దుబ్బాక మండలం పెద్ద గుండవెల్లికి చెందిన దండు రాజుకు జ్వరం రావడంతో ఓ పీఎంపీ వైద్యుడి వద్దకు తీసుకువెళ్లగా చికిత్స ప్రారంభించాడు. ఒక రోజు గడిచిన తర్వాత రాజు పరిస్థితి విషమించింది వెంటనే పెద్దాస్పత్రికి తీసుకువెళ్లాలని సూచించడంతో సిద్దిపేటలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకువెళ్లే సరికి అతడు చనిపోయాడు. రోగి పరిస్థితిని సకాలంలో చెప్పకుండా పీఎంపీ నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లనే రాజు మృతి చెందాడని ఆరోపిస్తూ అతడిపై దాడి చేసి సిద్దిపేట టూ టౌన్ లో ఫిర్యాదు చేశారు. రాజు డెంగ్యూ బారిన పడ్డా దాన్ని గుర్తించక పోవడమే మృతికి కారణమని తెలుస్తోంది.
నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు
గ్రామాల్లోని ఆర్ఎంపీ, పీఎంపీలు ఫస్ట్ ఎయిడ్ కే పరిమితం కావాలి. రోగులకు చికిత్సపేరిట ఇంజక్షన్, సెలైన్ వంటివి పెట్టవద్దు. నిబంధనలు అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. పెద్ద గుండవెల్లిలో వైద్యం వికటించి రోగి మృతి చెందిన విషయంపై పోలీసులు కేసు నమోదు చేశారు. - పుట్ల శ్రీనివాస్, ఇన్చార్జి డీఎంహెచ్‌వో
ప్రథమ చికిత్స కేంద్రం సీజ్
కొండపాక: ఆర్ఎంపీ వైద్యుడు ఆంజనేయులు మండలంలోని దుద్దెడలో నిర్వహిస్తున్న ప్రథమ చికిత్స కేంద్రాన్ని సోమవారం జిల్లా వైద్యాధికారులు సీజ్ చేశారు. మండల వైద్యాధికారి శ్రీధర్ మాట్లాడుతూ.. ఆంజనేయులు అంకిరెడ్డిపల్లికి చెందిన తేలు మహేశ్వరికి ఇంజక్షన్లు ఇచ్చి ఆమె అనారోగ్యానికి కారణమైనట్టు వచ్చిన ఫిర్యాదుతో ప్రాథమిక విచారణ నిర్వహించామన్నారు. ఆంజనేయులు విచారణకు రావాల్సిందిగా ఆదేశించగా ఇప్పటివరకు రాలేదని, సదరు మహిళ సికింద్రాబాద్ యశోద ఆస్పత్రిలో వెంటిలేటర్ పై చికిత్స పొందుతుందని తెలిపారు.