
- రోగుల ప్రాణాలతో ఆర్‌ఎంపీ, పీఎంపీల చెలగాటం
- క్లినిక్‌లు, బెడ్స్ ఏర్పాటు చేసి ట్రీట్‌మెంట్
- విచ్చలవిడిగా హెవీడోస్ ఇంజక్షన్లు, యాంటీ బయాటిక్స్, స్టెరాయిడ్స్ వాడకం
- ఎన్‌ఎంసీ, టీఎస్‌ఎంసీ తనిఖీల్లో బయటపడుతున్న అక్రమ దందా
- మంచిర్యాల జిల్లాలో 20 మందిపై కేసులకు సిఫార్సు
మంచిర్యాల, వెలుగు : రోగులకు ఫస్ట్ ఎయిడ్ చేసేందుకే పరిమితం కావాల్సిన ఆర్‌ఎంపీ, పీఎంపీలు తమ పరిధి దాటి వైద్యం చేస్తున్నారు. అర్హత లేకపోయినా క్లినిక్‌లు, బెడ్స్ ఏర్పాటు చేసి ట్రీట్‌మెంట్ చేస్తూ, తమ ఇష్టం వచ్చినట్లుగా మందులు వాడుతూ రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. కొందరైతే ల్యాబ్స్, మెడికల్ షాప్స్ నిర్వహించడమే కాకుండా గుట్టుచప్పుడు కాకుండా అబార్షన్లు చేస్తూ అందినకాడికి దండుకుంటున్నారు.
అర్హత లేకున్నా ట్రీట్‌మెంట్
రూల్స్ ప్రకారం ఆర్‌ఎంపీ, పీఎంపీలు ఫస్ట్ ఎయిడ్ చేసేందుకే పరిమితం కావాలి. తమ సెంటర్‌కు ప్రథమ చికిత్స కేంద్రం అని బోర్డు మాత్రమే పెట్టుకోవాలి. కానీ చాలామంది హాస్పిటల్స్‌ను తలపించేలా క్లినిక్‌లు ఏర్పాటు చేస్తున్నారు. అందులో నాలుగైదు బెడ్స్ ఏర్పాటు చేసి, తామే డాక్టర్‌గా చలామణి అవుతూ రోగులకు ట్రీట్‌మెంట్ చేస్తున్నారు. గ్రామాల్లో డాక్టర్లు అందుబాటులో లేకపోవడంతో ప్రజలు ఎక్కువగా ఆర్‌ఎంపీ, పీఎంపీలపైనే ఆధారపడుతున్నారు. ఇదే అదనుగా భావించిన వీరు పసి పిల్లల నుంచి పండు ముసలి వరకు హేవీ డోస్ ఇంజక్షన్లు, పెయిన్ కిల్లర్స్, యాంటీ బయాటిక్స్, స్టెరాయిడ్స్ ఇస్తున్నారు. వీటి వల్ల ఉన్న రోగం తగ్గకపోగా కొత్తగా ఫిట్స్ రావడం, బీపీ పెరగడం, తగ్గడం, తల తిరగడం, వాంతులు, ఒంటి నొప్పుల వంటి సమస్యలు ఏర్పడుతున్నాయి. ఈ టైంలో సరైన ట్రీట్‌మెంట్ అందక ప్రాణాలే గాలిలో కలిసిపోతున్నాయి.
మరికొందరు ఎలాంటి అర్హతలు లేకున్నా ల్యాబ్‌లు ఏర్పాటు చేసి అన్ని రకాల టెస్ట్‌లు, మెడికల్ షాపులు పెట్టి మందులు అమ్ముతూ తమ జేబులు నింపుకుంటున్నారు. కొంతమంది గుట్టుచప్పుడు కాకుండా ఎంపీటీ కిట్లు వాడుతూ అబార్షన్లు సైతం చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. మంచిర్యాలలోని హమాలీవాడకు చెందిన ఓ ఆర్‌ఎంపీ క్లినిక్ 24 గంటలు జనంతో కిటకిటలాడుతూ ఉంటుంది. అక్కడ బెడ్స్వేసి సెలైన్లు పెట్టి ట్రీట్‌మెంట్ అందిస్తున్నారు. పక్కనే మెడికల్ షాపు కూడా ఉంది. ఇతడు నెలల శిశువులకు సైతం వైద్యం చేస్తున్నా పట్టించుకునే నాథుడే లేడు. చెన్నూర్ ప్రాంతంలోని ఓ ఆర్‌ఎంపీ మోకాళ్ల నొప్పులు తగ్గిస్తానంటూ స్టెరాయిడ్స్ ఇస్తూ భారీగా వసూళ్లు చేశాడు. అతడిపై ఫిర్యాదులు రావడంతో అధికారులు కేసు నమోదు చేశారు.
వాడ వాడకో క్లినిక్
ఆర్‌ఎంపీ, పీఎంపీలపై సర్కార్ కంట్రోల్ లేకపోవడంతో వాడకో క్లినిక్ ఏర్పాటు చేసి ప్రాక్టీస్ మొదలు పెడుతున్నారు. ఏదైనా ఓ హాస్పిటల్‌లో నాలుగు నెలలు పనిచేస్తే చాలు.. తర్వాత ఆర్‌ఎంపీలుగా అవతారం ఎత్తుతూ ట్రీట్‌మెంట్ స్టార్ట్ చేస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కొంతమంది ఆర్‌ఎంపీ, పీఎంపీలకు కమ్యూనిటీ పారా మెడికల్ ట్రైనింగ్ ఇచ్చారు. వారిని గ్రామీణ వైద్యులుగా గుర్తిస్తూ సర్టిఫికెట్లు సైతం జారీ చేస్తామని చెప్పారు. కానీ అప్పటి సీఎం వైఎస్‌ఆర్ మరణంతో ఆ ప్రయత్నం అర్ధాంతరంగానే ఆగిపోయింది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన బీఆర్‌ఎస్ ఆర్‌ఎంపీ, పీఎంపీలకు ట్రైనింగ్ ఇస్తామంటూ పదేండ్లు కాలం గడిపింది. ప్రస్తుత ప్రభుత్వమైనా వీరికి ట్రైనింగ్ ఇచ్చి సర్టిఫికెట్లు జారీ చేయడంతోపాటు, వారి దందాపై ఓ కన్నేయాలని పలువురు కోరుతున్నారు.
రంగంలోకి ఎన్‌సీఎంసీ, టీఎస్‌ఎంసీ టీమ్‌లు
ఆర్‌ఎంపీ, పీఎంపీల ట్రీట్‌మెంట్ విషయం తెలిసినప్పటికీ మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్‌మెంట్ ఆఫీసర్లు పట్టించుకోవడం లేదు. దీంతో నేషనల్ మెడికల్ కౌన్సిల్ (ఎన్‌సీఎంసీ), తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్ (టీఎస్‌ఎంసీ) టీమ్‌లు రంగంలోకి దిగాయి. టీఎస్‌ఎంసీ మెంబర్, ఉమ్మడి ఆదిలాబాద్జిల్లా ఎథికల్ అండ్ యాంటీ క్వాకర్ కమిటీ చైర్మన్ డాక్టర్ యెగ్గెన శ్రీనివాస్, స్టేట్ చైర్మన్ డాక్టర్ కిరణ్‌కుమార్ ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లాలో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. మార్చిలో మంచిర్యాలలో ఇద్దరు, లక్సెట్టిపేట మరో ఇద్దరు ఆర్‌ఎంపీలపై కేసులు నమోదు చేయించారు. తాజాగా బుధవారం జిల్లా కేంద్రంలో ముగ్గురు, నస్పూర్‌లో 11 మంది, మందమర్రి, తాండూరులో ముగ్గురు రూల్స్‌కు విరుద్ధంగా ట్రీట్‌మెంట్ చేస్తున్నట్లు గుర్తించారు. మొత్తం 20 మందిపై నేషనల్ మెడికల్ కౌన్సిల్ యాక్ట్ ప్రకారం కేసుల నమోదుకు సిఫార్సు చేశారు.
గాలిలో కలుస్తున్న ప్రాణాలు
రామకృష్ణాపూర్‌కు చెందిన ఓ ఆర్‌ఎంపీ మూడు నెలల కిందట జ్వరంతో బాధపడుతున్న ఎనిమిదేండ్ల పాపకు ట్రీట్‌మెంట్ చేశాడు. జ్వరం తగ్గకపోగా మరునాడు ఫిట్స్వచ్చి పాప పరిస్థితి ప్రమాదకరంగా మారింది. వెంటనే మంచిర్యాల గర్నమెంట్ హాస్పిటల్‌కు తీసుకెళ్లగా ట్రీట్‌మెంట్ చేస్తుండగానే పాప చనిపోయింది. ఆర్‌ఎంపీ హేవీ డోస్ ఇంజక్షన్లు, యాంటీ బయాటిక్స్ ఇవ్వడం వల్ల హైపర్ టెన్షన్, కార్డియాక్ అరెస్ట్‌తో పాప చనిపోయినట్లు డాక్టర్లు చెప్పారు. బాధిత కుటుంబానికి రూ.లక్ష ఇచ్చి విషయం బయటకు రాకుండా మేనేజ్ చేశారు.
మంచిర్యాలలోని ఎన్టీఆర్‌నగర్‌లో ఓ బాలింత కు జ్వరం రాగా లోకల్‌గా ఉన్న ఓ ఆర్‌ఎంపీ వద్దకు వెళ్లారు. అతడు హెవీడోస్ యాంటీబయాటిక్స్ ఇవ్వడంతో ఒక్కసారిగా బీపీ పెరిగి బాడీ షివరింగ్ మొదలైంది. ప్రైవేట్ హాస్పిటల్‌కు తీసుకెళ్లగా ఒక రోజు ట్రీట్‌మెంట్ చేసి ఇంటికి పంపారు. ఇంజక్షన్ వేసిన చోట గడ్డలు కావడంతో సర్జరీ చేసి తొలగించారు.
లక్సెట్టిపేటకు చెందిన 12 ఏండ్ల పాపకు జ్వరం రావడంతో ఆర్‌ఎంపీ వద్దకు తీసుకెళ్లారు. ఇంజక్షన్ వేసినా తగ్గకపోవడంతో వారం రోజుల పాటు యాంటీబయాటిక్స్ ఇచ్చాడు. పది రోజుల తర్వాత కండ్లు పచ్చబడడంతో ప్రైవేట్ హాస్పిటల్‌కు తీసుకెళ్లగా జాండీస్ అని తేలింది. అక్కడ వారం రోజులు ట్రీట్‌మెంట్ చేశారు.
పది మంది నకిలీ డాక్టర్లపై కేసు
నిర్మల్, వెలుగు : నిర్మల్ జిల్లా కేంద్రంలో నకిలీ డాక్టర్లు, బోగస్ హాస్పిటల్స్ గుట్టు రట్టయింది. స్టేట్ మెడికల్ కౌన్సిల్ ఎథికల్ కమిటీ చైర్మన్ డాక్టర్ కిరణ్ కుమార్ తోట, ఎథికల్ కమిటీ సభ్యులు శ్రీనివాస్, డాక్టర్ నరేశ్‌కుమార్ కలిసి గురువారం జిల్లా కేంద్రంలోని పలు ప్రైవేట్ హాస్పిటల్స్‌పై దాడి చేశారు. ఎలాంటి అర్హత లేకున్నా రూల్స్‌కు విరుద్ధంగా ట్రీట్‌మెంట్ చేస్తున్న పది మందిపై కేసులు నమోదు చేశారు. కావేరి కంటి హాస్పిటల్, డీఎస్‌కే, శ్రీవందన జనరల్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్‌లో రూల్స్ విరుద్ధంగాట్రీట్‌మెంట్ చేస్తున్నట్లు గుర్తించారు. కొందరు రష్యన్ ఎంబీబీఎస్ పేరిట ఎండీలుగా చలామణి అవుతున్నారని, ఆర్‌ఎంపీ, పీఎంపీలు సైతం జనరల్ సర్జన్ పేరిట ట్రీట్‌మెంట్ చేయడమే కాకుండా, మెడికల్ షాపులు, ల్యాబ్స్ నిర్వహిస్తున్నారన్నారు. ఇక నుంచి నిరంతర తనిఖీలు చేస్తూ నకిలీ వైద్యులపై చర్యలు తీసుకుంటామన్నారు.
ఫస్ట్ ఎయిడ్ మాత్రమే చేయాలి
ఆర్‌ఎంపీ, పీఎంపీలు ఫస్ట్ ఎయిడ్ మాత్రమే చేయాలి. కొందరు యాంటీ బయాటిక్స్, స్టెరాయిడ్స్, హైడోస్ ఇంజక్షన్లు ఇస్తున్నారు. కొందరు ఎంటీపీ కిట్లతో అబార్షన్లు సైతం చేస్తున్నారు. ఇలాంటి వాటి వల్ల ఫిట్స్ రావడం, కిడ్నీలు ఫెయిల్ కావడం, షుగర్ వంటి సమస్యలు వస్తాయి. జిల్లా వ్యాప్తంగా తనిఖీలు చేస్తూ రూల్స్‌కు విరుద్ధంగా క్లినిక్‌లు నడిపిస్తున్న వారిని గుర్తించి కేసుల నమోదుకు సిఫార్సు చేస్తున్నాం.
- డాక్టర్ యెగ్గెన శ్రీనివాస్, టీఎస్‌ఎంసీ మెంబర్