మోపెడ్‌‌ను ఢీకొట్టిన కారు, దంపతులు మృతి

మోపెడ్‌‌ను ఢీకొట్టిన కారు, దంపతులు మృతి
  • జగిత్యాల జిల్లా ధర్మపురి సమీపంలో ప్రమాదం

ధర్మపురి/జగిత్యాల, వెలుగు : టీవీఎస్‌‌ ఎక్సెల్‌‌ను కారు ఢీకొట్టడంతో భార్యాభర్తలు చనిపోయారు. ఈ ప్రమాదం జగిత్యాల జిల్లా ధర్మపురి సమీపంలో బుధవారం తెల్లవారుజామున జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ధర్మపురి మండలం రామయ్యపల్లికి చెందిన కూస చంద్రయ్య (60), భాగ్యమ్మ (55) భార్యాభర్తలు.

వీరు కొత్త సంవత్సరం సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించేందుకు మంగళవారం రాత్రి ధర్మపురిలోని చర్చికి వెళ్లారు. ప్రార్థనలు ముగిసిన తర్వాత రాత్రి 2.30 గంటలకు టీవీఎస్‌‌ ఎక్సెల్‌‌పై గ్రామానికి తిరిగి వస్తున్నారు. ఈ క్రమంలో ఎస్‌‌ఆర్‌‌ఆర్‌‌ గార్డెన్స్‌‌ సమీపంలోకి రాగానే కారు ఢీకొట్టడంతో ఇద్దరూ రోడ్డు పక్కన పడిపోయారు.

చంద్రయ్య అక్కడికక్కడే చనిపోగా, భాగ్యమ్మ తీవ్రంగా గాయపడింది. గమనించిన స్థానికులు 108కు సమాచారం ఇవ్వగా వారు వచ్చి భాగ్యమ్మను జిల్లా ప్రధాన హాస్పిటల్‌‌కు తరలించారు. అక్కడ ట్రీట్‌‌మెంట్‌‌ తీసుకుంటూ ఆమె కూడా చనిపోయింది. ప్రమాదానికి కారణమైన డ్రైవర్‌‌ మంచిర్యాలకు చెందిన నూలుకొండ అన్షుమాన్‌‌ను స్థానికులు పట్టుకొని పోలీసులకు అప్పగించారు. మృతుల కోడలు కూస సునీత ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.