- ఒకరు మృతి, ఆరుగురికి గాయాలు
కల్లూరు, వెలుగు : ఖమ్మం జిల్లా కల్లూరు మండలంలోని పేరువంచ గ్రామంలో బుధవారం రాత్రి ఓ కారు బీభత్సం సృష్టించింది. వేగంగా వస్తున్న కారు అదుపు తప్పి రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళ్తున్న వారిని ఢీకొట్టడంతో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఇందలో ఒకరు ట్రీట్ మెంట్ తీసుకుంటూ చనిపోయారు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఏపీలోని కృష్ణా జిల్లా తిరువూరు నుంచి కల్లూరు వైపు వస్తున్న ఓ కారు పేరువంచ శివారులోని ఎన్ టీఆర్ కాలనీ సమీపంలోకి రాగానే అదుపుతప్పింది. ఈ క్రమంలో రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళ్తున్న మంచాల చిన్న నరసయ్య (65), మంచాల నరసమ్మ, కోట పెద్ద వెంకటేశ్ , కోట విశ్వనాథం, కమలమ్మ, నగేశ్ , వాసం వీరయ్యను కారు వెనుక నుంచి ఢీకొట్టి కొద్ది దూరం వెళ్లి చెట్టును ఢీకొని ఆగిపోయింది. గమనించిన స్థానికులు గాయపడిన వారిని కల్లూరులోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చిన్న నరసయ్య, నరసమ్మ పరిస్థితి విషమంగా ఉండడంతో వారిని ఖమ్మం ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించారు. అక్కడ ట్రీట్ మెంట్ తీసుకుంటూ చిన నరసయ్య చనిపోయాడు. నరసమ్మకు తలకు బలమైన గాయాలు కావడంతో ఆమె కండిషన్ క్రిటికల్ గా ఉందని డాక్టర్లు తెలిపారు.బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై ఎస్ కే.షాకీర్ చెప్పారు. ప్రమాద విషయం తెలుసుకున్న కాంగ్రెస్ నాయకుడు మట్టా దయానంద్ గురువారం నరసయ్య డెడ్ బాడీ వద్ద నివాళి అర్పించారు. అనంతరం స్వల్ప గాయాలతో బయటపడ్డ వారిని పరామర్శించారు.