బస్సును ఓవర్ టేక్ చేయబోయి యువకుడి మృతి ..మరొకరికి గాయాలు
శామీర్‌పేట, వెలుగు: బైక్‌పై బస్సును ఓవర్ టేక్ చేయబోయి యువకుడు దుర్మరణం చెందాడు. కరీంనగర్‌కు చెందిన షేక్ సక్లిన్ (22) తన స్నేహితుడు మహమ్మద్ ఫర్హాన్‌తో కలిసి హోండా యాక్టివాపై కరీంనగర్ నుంచి మెహదీపట్నం బయలుదేరారు. గురువారం రాత్రి శామీర్ పేట వద్ద అతివేగంగా ఆర్టీసీ బస్సును ఓవర్టేక్ చేయబోయి డివైడర్ ను ఢీ కొట్టాడు. అనంతరం బస్సు వెనుక టైర్ల కిందపడ్డారు. తలకు బలమైన గాయాలు కావడంతో సక్లిన్ అక్కడికక్కడే మృతి చెందగా, ఫర్హాన్‌కు గాయాలయ్యాయి. ఈ ప్రమాద దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఘటనపై శామీర్‌పేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.