మిర్యాలగూడ మండలంలో రోడ్డు ప్రమాదం

మిర్యాలగూడ, వెలుగు : నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం కొత్తగూడెం గ్రామ శివార్లలో బైక్​ అదుపుతప్పి రోడ్డు వెంట ఉన్న సమాధిని ఢీకొట్టడంతో మేనమామ, మేనల్లుడు చనిపోయారు. రూరల్​ పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం..కొత్తగూడెం గ్రామానికి చెందిన గర్నె శ్రీలత, సైదులు దంపతులు. శ్రావణ మాసం పురస్కరించుకుని గ్రామ శివార్లలోని మిట్టగూడెం రోడ్డు పక్కన పొలాల వైపు వన భోజనాలను ఏర్పాటు చేశారు.

ఇదే వేడుకకు మహాబూబాబాద్​ జిల్లా జయరాం గ్రామానికి చెందిన శ్రీలత సోదరుడు జాకటి నవీన్​ వచ్చాడు. వనభోజనాలు ముగిశాక మేనల్లుడు సందీప్​(18‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌)తో కలిసి బైక్​పై ఇంటికి బయలుదేరారు. కొద్ది దూరం రాగానే బైక్​ అదుపు తప్పి రోడ్డు పక్కనే ఉన్న సమాధిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరూ తీవ్రంగా గాయపడి దవాఖానాకు తరలిస్తుండగా చనిపోయారు.  కన్న కొడుకు, పేగు పంచుకు పుట్టిన సోదరుడు ఒకే యాక్సిడెంట్​లో చనిపోవడం ఆ తల్లికి తీరని ఆవేదనను మిగిల్చింది.