డెడ్​బాడీతో రోడ్డుపై రాస్తారోకో

  • రోడ్డు రోలర్​ను ఢీకొని టీవీఎస్ ఎక్సెల్​పై వెళ్తున్న వ్యక్తి మృతి
  • హైవే పనుల కాంట్రాక్టర్ నిర్లక్ష్యమే కారణమని ఆరోపణ
  • ఆందోళనకు దిగిన కుటుంబ సభ్యులు, బంధువులు

మోత్కూరు, వెలుగు: కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో మృతి చెందాడని డెడ్ బాడీతో కుటుంబ సభ్యులు, బంధువులు రోడ్డుపై రాస్తారోకో చేశారు. రెండు గంటలకుపైగా నిరసన తెలపడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయిన ఘటన యాదాద్రి జిల్లాలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. అడ్డగూడూరు మండలం చిర్రగూడూరుకు చెందిన కమ్మంపాటి అంజయ్య(64) టీవీఎస్ ఎక్సెల్ బండిపై శుక్రవారం చౌల్లరామారం వెళ్లి తిరిగి సొంతూరు వెళ్తుండగా.. నేషనల్ హైవే పనులు చేస్తున్న రోడ్డు రోలర్ ను ఢీకొని స్పాట్ లో చనిపోయాడు. మృతుడి కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్తులు భారీగా తరలివెళ్లారు.

కాంట్రాక్టర్​నిర్లక్ష్యంగా పనులు చేస్తూ.. ఎలాంటి హెచ్చరికలు బోర్డులు పెట్టకపోవడంతోనే ప్రమాదం జరిగిందని ఆరోపించారు. అంజయ్య డెడ్ బాడీతో చిర్రగూడూరు వద్ద రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో చేపట్టారు. కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతోనే మృతి చెందినందున బాధిత కుటుంబానికి రూ.20 లక్షల పరిహారం ఇచ్చి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్టర్ తో చర్చించగా రూ.20 వేలు ఇస్తామని చెప్పగా ధర్నాకు దిగారు. రోడ్డుపై డెడ్ బాడీని పెట్టి  బైఠాయించారు.

వలిగొండ -తొర్రూరు రోడ్డులో రాకపోకలు స్థంభించాయి. అడ్డగూడూర్ పోలీసులు వెళ్లి ఆందోళన విరమించాలని నచ్చజెప్పారు. మృతుడి కుటుంబానికి రూ.లక్ష ఇస్తామని కాంట్రాక్టర్ అంగీకరించడంతో ఆందోళన విరమించి అంజయ్య అంత్యక్రియలు పూర్తి చేశారు.