సిటీలో పట్టపగలు.. గ్యాస్ లారీ ఢీకొని స్కూటీపై వెళుతున్న యువతి మృతి

సిటీలో పట్టపగలు.. గ్యాస్ లారీ ఢీకొని స్కూటీపై వెళుతున్న యువతి మృతి

హైదరాబాద్: నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో స్కూటీపై వెళుతున్న యువతి స్పాట్లోనే చనిపోయింది. నాచారం హెచ్ఎంటి నగర్ వద్ద స్కూటీపై వెళుతున్న యువతిని గ్యాస్ లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో యువతి స్పాట్లోనే ప్రాణాలు కోల్పోయింది. బాధిత యువతి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. యువతి వివరాలపై ఆరా తీస్తున్నారు. హైదరాబాద్ లో ఇటీవల ఈ తరహా రోడ్డు ప్రమాదాలు రోజురోజుకూ పెరిగిపోతుండటం ఆందోళన కలిగించే విషయం. కొందరి నిర్లక్ష్యం నిండు ప్రాణాలను బలి తీసుకుంటుండటం గమనార్హం.  

మాదాపూర్ పీఎస్ పరిధిలో కూడా ఇటీవల ఇదే తరహా ఘటన వెలుగుచూసింది. కొత్తగూడ చౌరస్తా నుంచి మాదాపూర్ వైపు నడుచుకుంటూ వెళుతూ రోడ్డు దాటుతున్న  కలువ మాధవి అనే యువతిని వెనుక నుంచి వచ్చిన ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది. ఈ ఘటనలో బాధిత యువతి బస్సు చక్రాల కింద పడటంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు హుటాహుటిన ఆమెను ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ యువతి మృతి చెందింది. కలువ మాధవి వయసు 25 సంవత్సరాలే కావడం గమనార్హం.

ఆమె మాదాపూర్ లోని ఒక ప్రైవేట్ ఆఫీస్లో జాబ్ చేసినట్లు తెలిసింది. ఈ ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. అతి వేగం, ర్యాష్ డ్రైవింగ్ ఇలాంటి ప్రమాదాలకు కారణమవుతున్నాయి. హైదరాబాద్ నగరంలో సిటీ పోలీసులు ఎంతగా హెచ్చరిస్తున్నా కొందరి తీరు మారడం లేదు. అన్యాయంగా ఇతరులను పొట్టన పెట్టుకుంటున్నారు.