
- హైదరాబాద్ కు చెందిన ఒకరు మృతి, ఐదుగురికి గాయాలు
- నిజామాబాద్ జిల్లా బాల్కొండ వద్ద ప్రమాదం
బాల్కొండ, వెలుగు: హైదరాబాద్ చింతల్ నుంచి ప్రయాగ్ రాజ్ కుంభమేళాకు వెళ్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు చనిపోగా, మరో ఐదుగురికి గాయాలయ్యాయి. ఇన్చార్జి ఎస్సై రజనీకాంత్ తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ చింతల్‌కు చెందిన వనం సంపత్ రాణా(26), పోతు రమేశ్, చంద్రశేఖర్ చారి, వనం శ్రీనివాస్, రజనీకాంత్, పోతు సాయి విశాల్ కారులో యూపీ ప్రయాగ్ రాజ్ కు బయలుదేరారు.
గురువారం తెల్లవారుజామున బాల్కొండ మండలం చిట్టాపూర్ ఎక్స్ రోడ్డు వద్ద మహారాష్ట్రకు చెందిన లారీ ఓవర్ టేక్ చేస్తుండగా, కారు లారీ వెనక ఇరుక్కుంది. దీంతో సంపత్ రాణా అక్కడికక్కడే చనిపోగా, ఐదుగురు గాయపడ్డారు. గాయపడ్డ వారిని ఆర్మూర్ ఆసుపత్రికి తరలించారు. లారీ డ్రైవర్ కిషన్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
ఇసుక లారీ, బైక్ ఢీకొని ఇద్దరు..
భద్రాచలం: భద్రాద్రికొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలం బైరాగులపాడు వద్ద గురువారం ఇసుక లారీ, బైక్ ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో ఇద్దరు చనిపోయారు. మండలంలోని చింతగుప్ప పంచాయతీ సుజ్ఞానపురం గ్రామానికి చెందిన భూక్యా హరిబాబు(40), భూక్యా సోమ్లా(36) కొత్తగూడెంలో జరిగే కర్మకాండకు బైక్‌పై భద్రాచలం వైపు వెళ్తున్నారు. అదే సమయంలో భద్రాచలం నుంచి చర్ల వైపు ఇసుక కోసం వెళ్తున్న ఖాళీ లారీ, వారి బైక్‌ను ఢీకొట్టి కొద్ది దూరం లాక్కెళ్లింది.
దీంతో ఘటనా స్థలంలోనే ఇద్దరూ చనిపోయారు. యాక్సిడెంట్ అనంతరం డ్రైవర్ పారిపోతుండగా స్థానికులు అడ్డుకున్నారు. కుటుంబ సభ్యులతో పాటు బైరాగులపాడు గ్రామస్తులు రోడ్డుపై బైఠాయించారు. ఇసుక లారీలు తమ ప్రాణాలు తీస్తున్నాయని ఆందోళనకు దిగారు.