ఓఆర్ఆర్​పై ఘోర రోడ్డు ప్రమాదం ముగ్గురు మృతి 

ఓఆర్ఆర్​పై ఘోర రోడ్డు ప్రమాదం ముగ్గురు మృతి 
  •     చనిపోయిన వారిలో 2 నెలల బాబు
  •      మరో 10 మందికి గాయాలు
  •     ఓవర్ టేక్ చేయబోగా ప్రమాదం 
  •     యాదగిరిగుట్టకు వెళ్లి వస్తుండగా ఘటన  

 శంషాబాద్, వెలుగు : రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండల పరిధిలోని ఓఆర్ఆర్ పై పెద్ద గోల్కొండ వద్ద గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు చనిపోయారు. వనపర్తి జిల్లా ఆత్మకూరుకు చెందిన 23 మంది రెండు తుఫాన్ వాహనాల్లో యాదగిరిగుట్టకు వెళ్లారు. గురువారం సాయంత్రం తిరిగి వస్తూ శంషాబాద్ ఓఆర్ఆర్ పై పెద్ద గోల్కొండ వద్దకు వచ్చారు. వీరి వెనక డస్టర్ ​కారు, ఈ కారు వెనక బాలెనో కారు ఉన్నాయి. బాలెనో కారు డ్రైవర్​ ఓవర్​స్పీడ్​తో ముందున్న రెండు వాహనాలను ఓవర్ ​టేక్  ​చేయబోయాడు. కంట్రోల్​కాక ఒక్కసారిగా ఎడమ వైపు తిప్పడంతో డస్టర్​కారుకు తాకింది.

మళ్లీ కుడివైపుకు తిప్పడంతో తుఫాన్​కు తగిలింది. దీంతో తుఫాన్ వాహనం మూడు పల్టీలు కొట్టగా  డ్రైవర్ తాజుద్దీన్​(43), వరాలు (42), రెండు నెలల బాబు చనిపోయాడు. 12 ఏండ్ల దీక్షిత తీవ్రంగా గాయపడింది. మరో 9 మంది కూడా గాయపడడంతో అందరినీ శంషాబాద్ లోని ఓ ప్రైవేటు దవాఖానకు తరలించారు  శంషాబాద్ ఎయిర్​పోర్ట్​ ఏసీపీ శ్రీనివాస్, సీఐ బాలరాజు, క్రైమ్ డీఐ నాగయ్య, సీఐ నరసింహ, ట్రాఫిక్ సీఐ రాజు, ఎస్సైలు సంఘటన స్థలానికి చేరుకొని ట్రాఫిక్ క్లియర్ చేశారు. బాలెనో కారు డ్రైవర్​ పోలీసుల అదుపులో ఉన్నాడు.  

 కూలీల ఆటోను ఢీకొన్న లారీ..ఇద్దరు మృతి 

అలంపూర్ : కూలీల ఆటోను లారీ ఢీకొనడంతో ఇద్దరు చనిపోగా, పలువురికి గాయాలయ్యాయి. ఏపీలోని కర్నూల్​ జిల్లా తాండ్ర పాడుకు చెందిన 17 మంది కూలీలు ఆటోలో గద్వాల జిల్లా ఉండవెల్లి మండలం కంచుపాడుకు కలుపు పనులకు వస్తున్నారు. 44 నంబర్ హైవేపై వరసిద్ధి వినాయక పత్తి మిల్లు సమీపంలో ఆటోను ఐరన్ రాడ్​లోడుతో వెళ్తున్న లారీ వెనక నుంచి ఢీకొట్టింది. దీంతో ఆటో బోల్తా పడి, ఆటోలోని బెస్త లక్ష్మీదేవి(56) అక్కడికక్కడే చనిపోయింది.

తీవ్ర గాయాలైన సుజాత అలియాస్ రమాదేవి(40)ని హైవే అంబులెన్స్ లో కర్నూల్  ప్రభుత్వ దవాఖానకు తరలిస్తుండగా కన్నుమూసింది. ఆటోడ్రైవర్  నరసింహులు, అనితకు తీవ్రంగా గాయపడగా, మరో 13 మందికి స్వల్ప గాయాలయ్యాయి. వీరిని కర్నూల్ ప్రభుత్వ దవాఖానకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఉండవెల్లి ఎస్ఐ శ్రీనివాసులు తెలిపారు.

టిప్పర్ ​లారీ క్లీనర్​ మృతి

పెనుబల్లి : ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలంలో ఆగి వున్న లారీ ట్యాంకర్​ను బొగ్గు టిప్పర్​లారీ వెనక నుంచి ఢీకొట్టడంతో క్లీనర్ ​చనిపోయాడు. ఖమ్మం నుంచి దేవరపల్లి వెళ్లే జాతీయ రహదారిపై పెనుబల్లి మండలం లంకపల్లి వద్ద బుధవారం రాత్రి డాంబర్​తో వెళ్తున్న ట్యాంకర్ బ్రేక్​డౌన్​అయ్యింది. రోడ్డు పక్కన పార్క్​ చేయగా గురువారం తెల్లవారుఝామున కిష్టారం నుంచి కొత్తగూడెం బొగ్గులోడ్​తో వెళ్తున్న టిప్పర్​లారీ..

ఆగి ఉన్న ట్యాంకర్​ను వెనక నుంచి ఢీకొట్టింది. దీంతో  టిప్పర్​ లారీలో ఉన్న క్లీనర్ ​పంది రాయమల్లు (55) రెండు లారీల మధ్య ఇరుక్కొని చనిపోయాడు. ట్రాఫిక్​ జామ్​ అవ్వడంతో వీఎం బంజర్​ ఎస్ఐ వెంకటేశ్, వేంసూరు ఎస్ఐ వీరప్రసాద్  క్లియర్ ​చేశారు. ్యాబిన్​లో ఇరుకున్న డెడ్​బాడీని రెండుగంటలు శ్రమించి బయటకు తీశారు. టిప్పర్​లారీ డ్రైవర్​కిషోర్​పై కేసు నమోదు చేశారు.  

ఆటో అదుపు తప్పడంతో...

నల్లబెల్లి : వరంగల్​ జిల్లా నల్లబెల్లి మండలం నారక్కపేట సమీపంలోని  గురువారం ఆటో అదుపు తప్పి పల్టీ కొట్టడంతో ఒకరు చనిపోయారు. నర్సంపేట మండలం ఆకుల తండాకు చెందిన శ్రీరామ హరిబాబు (56) నల్లబెల్లి నుంచి ఆకులతండాకు ఆటోలో వెళ్తున్నాడు. నారక్కపేట 365 నేషనల్​హైవేపై ఆటో అదుపు తప్పి పల్టీ కొట్టడంతో హరిబాబు తీవ్రంగా గాయపడ్డాడు. దవాఖానకు తరలిస్తుండగా చనిపోయాడు. మృతుడికి ముగ్గురు కొడుకులు ఉన్నారు.