- కేసు నమోదు చేసిన పోలీసులు
చాంద్రాయణగుట్ట, వెలుగు: రోడ్డుపై జరిగిన చిన్న యాక్సిడెంట్ దాడుల చేసుకునే వరకు వెళ్లింది. దీంతో పోలీసులు ఓ రౌడీ షీటర్ పై కేసు నమోదు చేశారు. శనివారం రాత్రి కామాటిపుర దర్గా వద్ద వాహబ్ అనే వ్యక్తి కారులో వస్తున్నాడు. గుర్తు తెలియని ఓ యువకుడు బైక్ పై వచ్చి కారును ఢీకొట్టాడు. దీంతో పక్కనే ఉన్న మరో వ్యక్తి కాలికి కూడా గాయమైంది. అనంతరం బైక్ పై వచ్చి కారును ఢీకొట్టిన వ్యక్తి పారిపోయాడు.
కారులో ఉన్న వాహబ్ తనకు పరిచయం ఉన్న రౌడీ షీటర్ అసద్(30) అనే వ్యక్తిని కలిసి ప్రమాదానికి గల కారణాలు తెలిపాడు. రౌడీ షీటర్ అసద్ ప్రమాదం చేసిన యువకుడి వివరాలు సేకరించి.. సంజయ్ గాంధీనగర్ లో ఉండే గఫర్ (40) అనే వ్యక్తికి ఫోన్ చేశాడు. నీకు తెలిసిన కుర్రాడు యాక్సిడెంట్ చేశాడంటూ ఫోన్ లో గొడవకు దిగాడు. దీంతో గఫర్ తన ఇంటి అడ్రస్ ను ఇచ్చాడు.
ఆదివారం తెల్లవారుజామున మరో నలుగురు వ్యక్తులతో కలిసి గఫర్ ఇంటికి రౌడీ షీటర్ అసద్ వచ్చాడు. గఫర్ ను రౌడీ షీటర్ అసద్, మరో నలుగురు కలిసి దాడి చేశారు. దీంతో ఈ దాడిలో గఫర్ తీవ్రంగా గాయపడ్డాడు. గఫర్ ఫిర్యాదు మేరకు పోలీసులు అసద్ పై హత్యాయత్నం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.