బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే కారు ఢీకొని టెన్త్ స్టూడెంట్ మృతి

బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే కారు ఢీకొని టెన్త్ స్టూడెంట్ మృతి
  • మరో విద్యార్థికి తీవ్రగాయాలు
  • ఆలస్యంగా వెలుగులోకి ఘటన

చేవెళ్ల, వెలుగు:బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే కారు ఢీకొని టెన్త్ స్టూడెంట్ స్పాట్ లో మృతి చెందగా.. మరో విద్యార్థికి తీవ్ర గాయాలైన ఘటన ఆలస్యంగా తెలిసింది. పోలీసులు, బాధిత కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. వికారాబాద్​ జిల్లా నవాబుపేట్ మండలం గుబ్బడి ఫతేపూర్ గ్రామానికి చెందిన దేవేందర్, లక్ష్మి దంపతుల కొడుకు  భరత్(15), శ్రీనివాస్  కొడుకు శ్రీ చరణ్ గౌడ్(15) శంకర్​పల్లిలోని వివేకానంద స్కూల్​లో టెన్త్ క్లాస్ చదువుతున్నారు. గత శనివారం రాత్రి 7:30 గంటలకు స్కూల్ లో  ట్యూషన్ అయిపోగానే బైక్​పై ఇంటికి వెళ్తున్నారు. మార్గమధ్యలో రామంతాపూర్ క్రాస్ రోడ్ వద్ద ముందు వెళ్తున్న ఫార్చునర్ కారు డ్రైవర్ సడన్ బ్రేక్ వేయడంతో వెనక నుంచి ఢీకొట్టారు.

ఘటనలో భరత్ స్పాట్ లో మృతిచెందగా, చరణ్ కు తీవ్రగాయాలు అయ్యాయి. ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన ఫార్చునర్ కారు వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ ది అని, ప్రమాద సమయంలో ఆయన వెహికల్ లోనే ఉన్నట్లు బాధిత కుటుంబసభ్యులు ఆరోపిస్తూ.. ఆయనపై కంప్లయింట్ చేశారు.  కాగా.. మాజీ ఎమ్మెల్యే  కారు డ్రైవర్  పై శంకర్ పల్లి పోలీసులు కేసు నమోదు చేశారు.