జగిత్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శనివారం (జనవరి 10) సాయంత్రం తక్కళ్ళపెల్లి-అనంతారం రూట్లో రెండు బైకులు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ముగ్గురు యువకులు మృతి చెందారు. ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో యువకుడు ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో కన్నుమూశాడు. జగిత్యాల రూరల్ మండలం జాబితాపూర్‌కు చెందిన అరవింద్, మేడిపెల్లి మండలం కొండాపూర్‌కు చెందిన వంశీ స్పాట్లోనే మరణించారు.
ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో జాబితాపూర్‌కు చెందిన సాయం మృతి చెందాడు. యాక్సిడెంట్లో మరణించిన వంశీ అనే యువకుడు వారం క్రితమే గల్ఫ్ నుంచి సొంతూరికి వచ్చినట్లు తెలిసింది. ప్రమాదంలో మృతి చెందిన ముగ్గురు యువకులు 25 సంవత్సరాల లోపు వారే. చేతికి వచ్చిన బిడ్డలు రోడ్డు ప్రమాదంలో మరణించడంతో మృతుల తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. ప్రమాదానికి గల కారణం ఏంటన్న దానిపై ఆరా తీస్తున్నామని పేర్కొన్నారు.