న్యూ ఇయర్ వేడుకల సమయంలో మహబూబాబాద్ జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. కురవి మండలం జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదవశాత్తు లారీలో నుంచి గ్రానైట్ రాయి ఆటోపై పడటంతో ప్రమాదం సంభవించింది. ప్రమాదంలో ఇద్దరు ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందారు. పలువురికి తీవ్రగాయాలు అయ్యాయి. గాయాలపాలైన వారిని ఆస్పత్రికి తరలించారు.
ప్రమాద సమయంలో ఆటోలో ఏడుగురికి పైగా ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. మృతులు మంగోరిగూడెంకి చెందిన కూలీలు భూక్య సుమన్, లూనవత్ సురేష్‌గా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని పరిశీలిస్తున్నారు.