ఘోర రోడ్డు ప్రమాదం : పెళ్లికూతురు సహా ఐదుగురు మృతి

మహబూబాబాద్ జిల్లా : గూడూరు మండలం బొద్దుగొండ శివారులో జరిగిన ప్రమాదంలో నష్టపరిహారం డిమాండ్ చేస్తూ.. హైవే ముందు బైఠాయించారు బాధితులు. ఎర్రగుట్ట తండావాసులు మృత దేహాలతో రాస్తారోకో చేశారు. మర్రిమిట్ట దగ్గర జరిగిన యాక్సిడెంట్ లో ఆరుగురు చనిపోయారు. వీరిలో ఐదుగురు ఒకే కుటుంబానికి చెందినవారు.

మృతుల ఇంట్లో  ఫిబ్రవరి పదో తేదీన పెళ్లి వేడుక జరగాల్సి ఉంది. గుంజేడు ముసలమ్మ తల్లి దగ్గరకు వెళ్లి.. వరంగల్ కు పెండ్లి బట్టల కోసం వస్తుండగా … వీరు ప్రయాణిస్తున్న ఆటోను లారీ ఢీకొట్టింది. మృతుల్లో పెళ్లి కూతురు జాటోత్ ప్రమీల సహా… మరో ఇద్దరు ఆడవారు.. ముగ్గురు మగవాళ్లు ఉన్నారు. ప్రమాదంలో పెండ్లి పిల్ల తల్లి కల్యాణి.. అన్న ప్రదీప్, చిన్నాన్న ప్రసాద్, చిన్నమ్మ లక్ష్మి.. డ్రైవర్ రాము ప్రాణాలు కోల్పోయారు.

పెళ్లి బాజా మోగాల్సిన ఇంట్లో.. ఘోర విషాదం జరిగిందని బాధితులు కన్నీరు పెడుతున్నారు. యాక్సిడెంట్ లో మృతి చెందిన ఒక్కొక్కరికి 20 లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేస్తూ హైవే ముందు బైఠాయించారు. దీంతో… రోడ్డుపై వాహనాలు భారీగా నిలిచిపోయాయి. పోలీసులకు , తండా వాసులకు మధ్య  ఘర్షణ జరగడంతో.. ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది.

మర్రిమిట్ట ప్రమాద ఘటనపై తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్. కర్ణాటక పర్యటనలో ఉన్న సత్యవతి రాథోడ్.. జిల్లా అధికారులకు ఫోన్ చేసి ప్రమాదంపై ఆరా తీశారు. బాధిత కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అవసరమైన సాయం అందించాలని అధికారులను ఆదేశించారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని అన్నారు. ఐతే… నష్టపరిహారం డిమాండ్ చేస్తూ.. బాధితుల చేస్తున్న ఆందోళన కొనసాగుతోంది.