ములుగు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. RTC బస్సు, లారీ ఢీకొని 30 మందికి గాయాలు

ములుగు జిల్లాలో బుధవారం (డిసెంబర్ 4) ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఏటునాగారం నుండి హనుమకొండ వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు, లారీ ఎదురెదురుగా ఢీకొన్నాయి. తాడ్వాయి మండల శివారు జలగలంచ బ్రిడ్జి వద్ద బుధవారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్‎తో పాటు ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న 30 మంది గాయపడ్డారు. అందులో 15 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డట్లు తెలుస్తోంది. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని సహయక చర్యలు చేపట్టారు. 

క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ములుగు ఏరియా ఆస్పత్రికి తరలించారు. ములుగు-వరంగల్ హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఏటూరు నాగారం వెళ్లాల్సిన వాహనాలను మేడారం, తాడ్వాయి మీదుగా తరలిస్తున్నారు. హనుమకొండ వెళ్లా్ల్సిన వాహనాలు తాడ్వాయి, మేడారం మీదుగా పస్రాకు మళ్లించారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. రోడ్డు ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నట్లు వెల్లడించారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.