ఆటో, ట్రాక్టర్  ఢీకొని ఇద్దరు కూలీలు మృతి

ఆటో, ట్రాక్టర్  ఢీకొని ఇద్దరు కూలీలు మృతి
  • మ‌రో న‌లుగురికి గాయాలు

రాయికోడ్, వెలుగు: సంగారెడ్డి జిల్లా రాయికోడ్  మండ‌లం న‌ల్లంప‌ల్లి  గ్రామ స‌మీపంలో ట్రాక్టర్, ఆటో ఢీకొని ఇద్దరు కూలీలు చనిపోగా, మ‌రో న‌లుగురికి  గాయాలయ్యాయి. ఎస్ఐ నారాయ‌ణ తెలిపిన వివరాల ప్రకారం.. జ‌హీరాబాద్  మున్సిపాలిటీ ప‌రిధిలోని భ‌ర‌త్ న‌గ‌ర్, శాంతిన‌గ‌ర్  కాల‌నీల‌కు చెందిన కూలీలు రాయికోడ్  మండ‌లం పీప‌డ్ పల్లి గ్రామంలో ప‌త్తి ఏరేందుకు శుక్రవారం వ‌చ్చారు.

ప‌నులు ముగించుకొని తిరిగి జ‌హీరాబాద్ కు వెళ్తున్న క్రమంలో న‌ల్లంప‌ల్లి చౌర‌స్తా వ‌ద్దకు రాగానే ప‌త్తి సంచులు తీసుకొనిరావ‌డానికి పొలానికి వెళ్తున్న ట్రాక్టర్  ఆటోను ఢీకొట్టింది. దీంతో ఆటో ప‌ల్టీ కొట్టి రోడ్డు ప‌క్కన పొలంలో ప‌డిపోయింది. ఈ ప్రమాదంలో న‌ర్సమ్మ(55), లాల్ బీ(19) అక్కడిక‌క్కడే చనిపోగా, ఆటో డ్రైవ‌ర్  జావీద్, ర‌జియా, సానియా, మైమూనీకి తీవ్ర గాయాల‌య్యాయి. వారిని 108లో జ‌హీరాబాద్  ఏరియా ఆసుప‌త్రికి త‌ర‌లించారు.