
లక్నో: ఉత్తర్ ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాకు వెళ్లి వస్తుండగా రోడ్డు ప్రమాదం జరిగి ముగ్గురు తెలంగాణ వాసులు మృతి చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రయాగ్ రాజ్‌కు 60కిలోమీటర్ల దూరంలోని మీర్జా పూర్ వద్ద ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. ఈ రోడ్డు ప్రమాదంలో సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలం మామిడిగి గ్రామానికి చెందిన వెంకట్ రాం రెడ్డి దంపతులతో సహా వారి కారు డ్రైవర్ మృతి చెందారు.
మహా కుంభ్‌లో పుణ్య స్నానాలు ఆచరించి తిరిగి వస్తుండగా.. మీర్జాపూర్ వద్ద వీరు ప్రయాణిస్తోన్న కారు టిప్పర్‌ను ఢీకొట్టింది. ప్రమాదంలో కారు నుజ్జునుజ్జు అయ్యింది. దీంతో వెంకట్రాంరెడ్డి దంపతులతో పాటు కారు డ్రైవర్ స్పాట్ లోనే చనిపోయినట్లు పోలీసులు తెలిపారు. వెంకట్రాంరెడ్డి ప్రస్తుతం జహీరాబాద్ డివిజన్ నీటిపారుదల శాఖ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. దైవ దర్శనానికి వెళ్లి తిరిగి వస్తూ రోడ్డు ప్రమాదంలో మృతి చెందటంతో మామిడిగి గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
మృతదేహాలను స్వస్థలానికి తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా, ఇటీవల కుంభమేళాకు వెళ్లి వస్తుండగా మధ్యప్రదేశ్‌లో జబల్పూర్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగి హైదరాబాద్‌కు చెందిన 10 మంది భక్తులు మరణించిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగానే.. తాజాగా మరో రోడ్డు ప్రమాదంలో తెలంగాణకు చెందిన మరో ముగ్గురు మృత్యువాత పడటం విషాదంగా మారింది.