- వరంగల్ జిల్లాలో ఇద్దరు, ములుగు జిల్లాలో ఒకరు...
రాయపర్తి, వెలుగు: బైక్ అదుపుతప్పి చెట్టును ఢీకొట్టడంతో ఇద్దరు యువకులు చనిపోయారు. ఈ ప్రమాదం వరంగల్ జిల్లా రాయపర్తి మండలంలోని కిష్టాపురం వద్ద జరిగింది. పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. కిష్టాపురం గ్రామానికి చెందిన ఈదునూరి యాకయ్య, కళ్యాణి దంపతుల కుమారుడు అన్వేశ్ (20), ఎర్ర శ్రీనివాస్, లలిత దంపతుల కుమారుడు రాజు(20) కలిసి గురువారం రాత్రి బైక్ పై కాట్రపల్లి వైపు వెళ్తున్నారు. తోడెలుబండ తండా సమీపంలోకి రాగానే బైక్ అదుపుతప్పి చెట్టును ఢీకొట్టడంతో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. అర్ధరాత్రి కావడం, అటువైపు ఎవరూ రాకపోవడంతో ఇద్దరూ అక్కడికక్కడే చనిపోయారు. శుక్రవారం తెల్లవారుజామున డెడ్ బాడీలను గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వారు ఘటనాస్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు.
- రోడ్డుకు అడ్డంగా పడిన చెట్టును ఢీకొని...
తాడ్వాయి, వెలుగు : రోడ్డుకు అడ్డంగా పడిన చెట్టును బైక్ ఢీకొట్టడంతో ఓ వ్యక్తి చనిపోగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన ములుగు జిల్లా తాడ్వాయి మండలం కాటాపూర్ సమీపంలో గల బంజారానాంపల్లి వద్ద గురువారం రాత్రి జరిగింది. తాడ్వాయిలోని హరిత హోటల్ లో పనిచేస్తున్న యాలం భూపతిరావు (20), సందీప్ , అరవింద్ , విజేందర్ రెడ్డి బైక్ పై కాటాపూర్ గ్రామానికి వెళ్లారు. రాత్రి రెండు గంటల టైంలో తిరిగి తాడ్వాయికి వస్తున్నారు.
బంజారానాంపల్లి వద్దకు రాగానే రోడ్డుకు అడ్డంగా పడి ఉన్న చెట్టును ఢీకొట్టారు. దీంతో భూపతిరావు అక్కడికక్కడే చనిపోగా, సందీప్, అరవింద్, విజేందర్ తీవ్రంగా గాయపడ్డారు. కొద్దిసేపటి తర్వాత వారే 108కు సమాచారం ఇవ్వగా పీహెచ్ సీకి తరలించారు. అక్కడ ఫస్ట్ ఎయిడ్ చేసిన అనంతరం ములుగు హాస్పిటల్ కు తరలించారు. మృతుడి సోదరుడు యాలం దయాసాగర్, తండ్రి బాబురావు ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై శ్రీకాంత్ రెడ్డి చెప్పారు.