తిరుమల: తిరుమల మొదటి ఘాట్ రోడ్లో రోడ్డు ప్రమాదం జరిగింది. మొదటి ఘాట్ 18వ మలుపు వద్ద వేగంగా వచ్చిన ద్విచక్ర వాహనం కారును ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్పై ప్రయాణిస్తున్న ముగ్గురికి గాయాలయ్యాయి. ఒక మహిళకు తీవ్ర గాయాలు కావడంతో క్షతగాత్రులను అంబులెన్స్లో ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారు తిరుమల ఘాట్ రోడ్డులో పనిచేసే గుర్కా ఫ్యామిలీగా గుర్తించారు. ఈ రోడ్డు ప్రమాదం జరిగిన సమయంలో తిరుపతి జేఈవో వీరబ్రహ్మం అటుగా వెళ్తున్నారు. గాయపడిన వారిని గమనించిన ఆయన వెనువెంటనే అంబులెన్స్ ఘటనా స్థలానికి చేరుకునేందుకు చొరవ చూపారు. 108లో క్షతగాత్రులను తిరుపతిలోని రుయా ఆసుపత్రికి తరలించారు. తిరుమల నుండి తిరుపతికి వస్తుండగా ఈ దుర్ఘటన జరిగింది.
తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో ఇటీవల జరుగుతున్న రోడ్డు ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. గత నెలలో కూడా తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో రోడ్డు ప్రమాదం జరిగింది. మహారాష్ట్రకు చెందిన నలుగురు భక్తులు ఈ ఘటనలో త్రుటిలో తప్పించుకున్నారు. ఏడో మైలు వద్ద ఉన్న ఆంజయనేయ స్వామి విగ్రహం సమీపంలో అతి వేగంతో వచ్చిన కారు చెట్టును ఢీ కొట్టింది. ఈ ఘటనలో కారు ముందు భాగం నుజ్జునుజ్జయింది. అదృష్టవశాత్తూ ఆ కారులో ఉన్న నలుగురు భక్తులు ఎలాంటి గాయాల పాలవకుండా బయటపడ్డారు.