కారు అదుపుతప్పి ఇద్దరు మృతి

కారు అదుపుతప్పి ఇద్దరు మృతి
  • భువనగిరి పట్టణ శివారులో ప్రమాదం

యాదాద్రి, వెలుగు : కారు అదుపుతప్పి రోడ్డు పక్కకు దూసుకెళ్లడంతో ఇద్దరు యువకులు చనిపోయారు. ఈ ప్రమాదం యాదాద్రి జిల్లా భువనగిరి పట్టణ శివారులో బుధవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... హైదరాబాద్‌‌‌‌లోని రామంతాపూర్‌‌‌‌కు చెందిన ఇంటర్‌‌‌‌ స్టూడెంట్స్‌‌‌‌ యశ్వంత్‌‌‌‌ (17), అర్జున్, నితిన్, శ్రీను, మణి జయంత్‌‌‌‌ కలిసి యాదగిరిగుట్టలోని లక్ష్మీనర్సింహస్వామి వారిని దర్శనానికి వచ్చేందుకు ప్లాన్‌‌‌‌ చేసుకున్నారు. 

ఇందులో భాగంగా రామంతాపూర్‌‌‌‌కే చెందిన అబ్దుల్‌‌‌‌ సుఫియాన్‌‌‌‌ (25)కారును రెంట్‌‌‌‌కు మాట్లాడుకున్నారు. దీంతో సుఫియాన్‌‌‌‌ షాకీబ్‌‌‌‌ అనే బాలుడిని వెంటబెట్టుకొని ఐదుగురు స్టూడెంట్లతో కలిసి బుధవారం ఉదయం 5 గంటలకు రామంతాపూర్‌‌‌‌ నుంచి బయలుదేరారు. ఏడు గంటల వరకు యాదగిరిగుట్టకు చేరుకొని స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం భువనగిరి శివారులోని స్వర్ణగిరికి బయలుదేరారు. 

ఈ క్రమంలో భువనగిరి పట్టణం దాటగానే కారు అదుపుతప్పి రోడ్డు పక్కన ఏర్పాటు చేసిన బారికేడ్లను ఢీకొని, పక్కకు దూసుకెళ్లింది. దీంతో డ్రైవర్‌‌‌‌ అబ్దుల్‌‌‌‌ సుఫియాన్‌‌‌‌తో పాటు అతడి పక్కన కూర్చున్న యశ్వంత్‌‌‌‌ తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే చనిపోయారు. అర్జున్‌‌‌‌, నితిన్, శ్రీను, మణి జయంత్, షాకిబ్‌‌‌‌ తీవ్రంగా గాయపడ్డారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని గాయపడిన వారిని జిల్లా హాస్పిటల్‌‌‌‌కు తరలించారు. అనంతరం మెరుగైన ట్రీట్‌‌‌‌మెంట్‌‌‌‌ కోసం హైదరాబాద్‌‌‌‌కు తరలించారు.