
- గజ్వేల్ మండలంలో ప్రమాదం
గజ్వేల్, వెలుగు : బైక్‌పై వెళ్తున్న దంపతులను లారీ ఢీకొట్టడంతో భార్య చనిపోగా, భర్త తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ప్రమాదం సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం అహమదీపూర్ గ్రామ శివారులోని గజ్వేల్ – తొగుట రోడ్డుపై ఆదివారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని ఆర్‌అండ్‌ఆర్ కాలనీ బ్రాహ్మణ బంజేరుపల్లికి చెందిన సుతారి సత్తవ్వ (48), కిష్టయ్య భార్యాభర్తలు. ఆదివారం బైక్‌పై కాసులాబాద్‌లోని బంధువుల ఇంటికి బయలుదేరారు. ఈ క్రమంలో అహమదీపూర్ శివారులోకి రాగానే లారీ ఎదురుగా ఢీకొట్టింది. ప్రమాదంలో సత్తవ్వ అక్కడికక్కడే చనిపోగా కిష్టయ్య రెండు కాళ్లు నుజ్జునుజ్జయ్యాయి. విషయం తెలుసుకున్న 108 సిబ్బంది కిష్టయ్యను గాంధీ హాస్పిటల్‌కు తరలించారు. అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.