హైదరాబాద్ విజయవాడ ప్రధాన రహదారి పై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.. నల్గొండ జిల్లాలో టాటా ఏస్ ప్రభుత్వ వాహనాన్ని ఢీ కొనడంతో ప్రమాదం చోటు చేసుకుంది.. ఆదివారం ( ఫిబ్రవరి 2, 2025 )జరిగిన ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలిలా ఉన్నాయి.. జిల్లాలోని నకిరేకల్ సమీపంలో టాటా ఏస్ వాహనం ఓ ప్రభుత్వ వాహనాన్ని ఢీకొనగా.. వెనక నుండి వస్తున్న లారీ టాటా ఎస్ వాహనాన్ని బలంగా ఢీ కొట్టింది.
ఈ ఘటనలో ప్రభుత్వ వాహనంలో ఉన్న పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ముందు ప్రభుత్వ వాహనం, వెనక లారీ.. టాటా ఎస్ వాహనంలోనే చిక్కుకుపోయిన డ్రైవర్. సాయం కోసం ఆర్త నాదాలు పెట్టాడు.స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న మూడు అంబులెన్స్ లలో క్షత గాత్రులను ఆసుపత్రికి తరలించారు.
ఈ క్రమంలో ప్రమాదం తో హైదరాబాద్ విజయవాడ హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. కిలో మీటర్ల మేర వాహనాలు నిలిచిపోవడంతో..రాకపోకలకు అవాంతరం ఏర్పడింది. రెండు వైపుల వెళ్లే వాహనాలు మొత్తం ఒక వైపుకు రావడంతో ట్రాఫిక్ ను క్లియర్ చేసేందుకు అవస్థలు పడుతున్నారు పోలీసులు.