
- ఇద్దరు మృతి.. 8 మందికి గాయాలు
ముదిగొండ, వెలుగు: ఖమ్మం-–కోదాడ హైవే పై శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు చనిపోగా, 8 మంది గాయపడ్డారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం గువ్వలగూడెం గ్రామంలోని ఓ క్వారీ నుంచి గ్రానైట్ రాళ్లను డీసీఎంలో ఖమ్మం తరలిస్తుండగా, ముదిగొండ సమీపంలో ఓవర్ లోడ్ తో డీసీఎం వీల్ విరగడంతో పల్టీ కొట్టింది.
ఆ సమయంలో డీసీఎంలో డ్రైవర్‌తో పాటు 10 మంది కూలీలు ఉన్నారు. గుండాల మండలం కొమరారం గ్రామానికి బానోతు హుస్సేన్(30), డోర్నకల్ మండలం అన్నారం గ్రామానికి చెందిన గుగులోతు వీరన్న(28) గ్రానైట్ రాళ్లు మీద పడడంతో అక్కడికక్కడే చనిపోయారు. మిగిలిన వారికి గాయాలయ్యాయి. ముదిగొండ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని బాధితులను 108లో ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ కూలీలంతా ఖమ్మం ఇండస్ట్రీ ఏరియాలో పని చేసేవారని
గుర్తించారు.
మెదక్ జిల్లాలో ఇద్దరు సీఆర్పీలు..
చేగుంట: బైక్ ను ట్రాలీ ఆటో ఢీకొనడంతో విద్యా శాఖలో పనిచేస్తున్న ఇద్దరు క్లస్టర్ రిసోర్స్ పర్సన్లు(సీఆర్పీ) చనిపోయారు. స్థానికులు చెప్పిన వివరాల ప్రకారం.. మెదక్ జిల్లా చేగుంట మండలం గొల్లపల్లి తండాకు చెందిన దేవసోత్ రమేశ్(39), చందాయిపేట గ్రామానికి చెందిన ఎర్ర శ్రీనివాస్(38) మక్కరాజుపేట స్కూల్ కాంప్లెక్స్ లో సమగ్ర శిక్ష అభియాన్ సీఆర్పీలుగా పని చేస్తున్నారు.
శుక్రవారం ఇద్దరూ కలిసి స్కూల్ కాంప్లెక్స్ లో పనులు పూర్తి చేసుకొని బైక్ పై చేగుంట ఎంఈవో ఆఫీస్‌కు బయలుదేరారు. శివునూరు గ్రామ సమీపంలో వారి బైక్ ను ఎదురుగా వస్తున్న ఆటో బలంగా ఢీకొట్టింది. దీంతో రమేశ్ అక్కడికక్కడే చనిపోగా, తీవ్రంగా గాయపడిన శ్రీనివాస్ ను ఆసుపత్రికి తరలిస్తుండగా చనిపోయాడు. రమేశ్ భార్య గొల్లపల్లి తండాలో అంగన్వాడీ టీచర్ గా పని చేస్తుండగా, కూతురు, కొడుకు ఉన్నారు. శ్రీనివాస్ కు ఇద్దరు కొడుకులు(ట్విన్స్), ఒక కూతురు ఉన్నారు. డ్యూటీకి వెళ్లి తిరిగిరాని లోకాలకు వెళ్లడంతో వారి కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు