
- ఓవర్‌స్పీడ్‌తో మెట్రో పిల్లర్ ను ఢీకొట్టిన వైనం
- కారులో ముగ్గురు మైనర్లు, ఒక యువకుడు
- మద్యం తాగినట్లు గుర్తింపు
కూకట్పల్లి, వెలుగు: కేపీహెచ్బీలో బుధవారం అర్ధరాత్రి కారు బీభత్సం సృష్టించింది. ఓవర్‌స్పీడ్ తో అదుపుతప్పి మెట్రో పిల్లర్‌ను ఢీకొట్టింది. ప్రమాద సమయంలో కారులో ముగ్గురు మైనర్లతోపాటు ఒక యువకుడు ఉండగా, ఒకరికి తప్పితే ఎవరికీ పెద్దగా గాయాలు కాలేదు. అయితే, వీరంతా మద్యం తాగి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.
పటాన్‌చెరుకు చెందిన లోకేశ్(20), మరో ముగ్గురు మైనర్లు కలిసి బుధవారం సాయంత్రం కారులో నగరానికి వచ్చి మద్యం సేవించారు. తిరిగి అర్ధరాత్రి సమయంలో పటాన్‌చెరుకు బయలుదేరారు. మద్యం మత్తులో ఉన్న లోకేశ్ అతివేగంగా కారు నడపడంతో కేపీహెచ్‌బీ మెట్రో స్టేషన్వద్ద అదుపుతప్పి పిల్లర్‌ను ఢీకొట్టాడు. అదృష్టవశాత్తు అతనొక్కడికే గాయాలు కాగా, మిగతా ముగ్గురు క్షేమంగా బయటపడ్డారు. సమాచారం తెలుసుకున్న 108 సిబ్బంది వీరిని పటాన్చెరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం లోకేశ్చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.