కూలికి పోయి తిరిగి ఇంటికి వస్తుండగా.. ఇంతలోనే ఘోరం..

హనుమకొండ: అప్పటివరకు వ్యవసాయ పనుల్లో మునిగి తేలారు..పని ముగించుకొని ఇంటికి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఆటోలో ఇంటికి బయల్దేరిన కూలీలకు అనుకోని సంఘటన ఎదురైంది. ఒక్కసారిగా కుదుపులు..పెద్ద శబ్ధం..అంతే..చెల్లాచెదరుగా పడిపోయారు..తీవ్రంగా గాయపడ్డారు. హనుమకొండ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 9మందికి తీవ్రంగా గాయాలయ్యాయి. 

హన్మకొండ జిల్లా ఐనవోలు మండలం పంథిని వద్ద బుధవారం ఆగస్టు 7, 2024న సాయంత్రం రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డుపై ఆగివున్న ట్రాక్టర్ ను వెనకనుంచి కూలీలతో వెళ్తున్న ఆటో ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ తో సహా 9మందికి తీవ్ర గాయాలయ్యాయి. కూలీ పనులు ముగించుకొని  వస్తుండగా ఐనవోలు మండలం పంథిని వద్దకు రాగానే ఆగి ఉన్న ట్రాక్టర్ ను కూలీలతో వెళ్తున్న ఆటో ఢీకొట్టింది. గాయపడ్డవారిని స్థానికులు 108 ద్వారా వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. కూలీలంతా వర్ధన్నపేట మండలం కట్ర్యల గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు.