
- పోలీసులకు తెలిపిన వడోదర యాక్సిడెంట్ నిందితుడు
గాంధీనగర్: గుజరాత్ వడోదరలోని కరేలిబాగ్‌లో కారు యాక్సిడెంట్ చేసి ఓ మహిళ మృతికి కారణమైన లా స్టూడెంట్ రక్షిత్ చౌరాసియా(20)పై పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు నమోదు చేశారు. తాను తాగి కారు నడపలేదని.. కేవలం గంజాయి మాత్రం తీసుకున్నానని నిందితుడు ఒప్పుకున్నాడు.
రక్షిత్ చౌరాసియా ప్రమాదానికి గల కారణాన్ని వివరిస్తూ.." హోలీ పండుగ సందర్భంగా గురువారం రాత్రి హోలికా దహన్‌ను చూడటానికి వెళ్లిన స్నేహితుడిని మరో ఫ్రెండ్‌తో కలిసి కారులో డేరా సర్కిల్ వద్ద దింపాను. రిటర్న్ వస్తున్న టైంలో మా కారు ముందు స్కూటీ వెళ్తున్నది. కుడివైపు వెళ్లేందుకు ప్రయత్నించగా..రోడ్డుపై ఒక పెద్ద గుంత అడ్డు వచ్చింది.
టైరు అందులో పడటంతో కారు అదుపుతప్పి..స్కూటీని ఢీకొన్నది. దాంతో కారు ఎయిర్‌బ్యాగ్‌లు తెరుచుకున్నాయి. ఆ తర్వాత కారు ఎక్కడికి వెళ్లిందో నాకు తెల్వదు. ప్రమాదం జరిగిన సమయంలో కారు గంటకు 50 నుంచి -60 కి.మీ వేగంతో ఉంది" అని రక్షిత్ చౌరాసియా తెలిపాడు. తాను ఎలాంటి మత్తు పదార్థాలు సేవించలేదని మొదట చెప్పినప్పటికీ, ఆ తర్వాత భాంగ్(గంజాయి) తీసుకున్నట్లు ఒప్పుకున్నాడు. తన తప్పు వల్లే ప్రమాదం జరిగిందని అంగీకరించాడు.