మత్తులో కారు నడిపి మహిళను చంపేశాడు

మత్తులో కారు నడిపి మహిళను చంపేశాడు
  • ఆపై వన్​మోర్​ రౌండ్​ అంటూ కేకలు.. గుజరాత్​లో యువకుడి బీభత్సం

వడోదర: మద్యం తాగి, ఆపై ర్యాష్  డ్రైవింగ్  చేసి ఓ మహిళను చంపేశాడు. మరో నలుగురిని తీవ్రంగా గాయపరిచి బీభత్సం సృష్టించాడో యువకుడు. గుజరాత్ లో వడోదరలోని కరేలిబేగ్  ఏరియాలో గురువారం అర్ధరాత్రి ఈ ఘటన జరిగింది. నిందితుడు రక్షిత్  చౌరాసియాను వాహనదారులు పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. 

ఉత్తర ప్రదేశ్ లో వారణాసికి చెందిన రక్షిత్.. గుజరాత్ లోని వడోదరలో ఓ యూనివర్సిటీలో లా చదువుతున్నాడు. గురువారం రాత్రి పీకలదాకా మద్యం తాగాడు. తర్వాత తన ఫ్రెండ్  మిత్  చౌహాన్ (కారు ఓనర్  ఇతడే) తో కలిసి రక్షిత్  కారు డ్రైవ్  చేస్తుకుంటూ వెళ్తున్నాడు. చౌహాన్  డ్రైవర్  సీటు పక్కన కూర్చున్నాడు. రక్షిత్  120 కిలోమీటర్ల వేగంతో కారు నడుపుతూ రెండు టూవీలర్లను ఢీకొట్టాడు. ఓ టూలర్ పై తన కూతురితో కలిసి హోలీ పండుగ కోసం రంగులు కొనేందుకు వెళ్తున్న మహిళ తీవ్రంగా గాయపడి చనిపోయింది. ఆ కూతురితో పాటు మరో టూవీలర్ పై వెళ్తున్న ఇద్దరు, మరో వ్యక్తి కూడా తీవ్రంగా గాయపడ్డారు. రక్షిత్  ఆ బండ్లను ఢీకొట్టిన తర్వాత కారు ముందు భాగం నుజ్జునుజ్జయింది. కొంచెం దూరం వెళ్లాక అతను కారు ఆపగా.. అతని ఫ్రెండ్  చౌహాన్  వెహికల్  నుంచి బయటకు వచ్చాడు. తనకు ఏమీ తెలియదని అక్కడున్న వారికి చెప్పాడు. రక్షిత్  కూడా బయటకు వచ్చి రచ్చరచ్చ చేశాడు. ఇంకో రౌండ్  ఇలాగే నడుపుతానని, ఓం నమ:శివాయ అంటూ నినాదాలు చేశాడు.

అడ్డుకున్న వాహనదారులు

ఈ క్రమంలో రోడ్డుపై వెళ్తున్న వాహనదారులు రక్షిత్ ను అడ్డుకుని దేహశుద్ధి చేశారు. పోలీసులకు సమాచారం అందించగా వారు ఘటనా స్థలానికి చేరుకుని నిందితుడిని అరెస్టు చేశారు. గాయపడిన ముగ్గురిని ఆసుపత్రికి తరలించారు. రక్షిత్  సృష్టించిన బీభత్సం అక్కడున్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డయింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.