
- మరొకరికి గాయాలు, కరీంనగర్ జిల్లా కేశవపట్నంలో ప్రమాదం
- మహబూబాబాద్‌లో ఆటోను ఢీకొట్టిన లారీ
- ఒకరు మృతి, 12 మందికి గాయాలు
శంకరపట్నం, వెలుగు : రెండు బైక్‌లను లారీ ఢీకొట్టడంతో తండ్రీకొడుకు చనిపోగా, మరో వ్యక్తి గాయపడ్డాడు. ఈ ప్రమాదం కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం కేశవపట్నంలో శుక్రవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...
మండలంలోని మక్త గ్రామానికి చెందిన అజీమ్ (38), అతడి కొడుకు రహమాన్ (13)తో కలిసి బైక్‌పై బయటకు వెళ్లి తిరిగి ఇంటికి వస్తున్నారు. ఇదే టైంలో మెట్‌పల్లి గ్రామానికి చెందిన మాందాడి శ్రీనివాస్‌రెడ్డి, హరీశ్ సైతం బైక్‌పై వస్తున్నారు. కేశవపట్నం బస్టాండ్ సమీపంలోకి రాగానే వరంగల్ నుంచి కరీంనగర్ వెళ్తున్న ఓ లారీ రెండు బైక్‌లను ఎదురుగా ఢీకొట్టింది. ప్రమాదంలో అజీమ్, రహమాన్, శ్రీనివాస్‌రెడ్డి తీవ్రంగా గాయపడ్డారు.
స్థానికుల సమాచారంతో ప్రమాదస్థలానికి చేరుకున్న పోలీసులు 108లో ముగ్గురిని హుజూరాబాద్ హాస్పిటల్‌కు తరలించారు. వారిని పరీక్షించిన డాక్టర్లు అజీమ్, రహమాన్ చనిపోయినట్లు నిర్ధారించారు. శ్రీనివాస్‌రెడ్డి ట్రీట్‌మెంట్ తీసుకుంటున్నాడు. యాక్సిడెంట్ అనంతరం డ్రైవర్ లారీని ఆపకుండా వెళ్లిపోవడంతో స్థానిక యువకులు వెంబడించి తాడికల్ సమీపంలో లారీని పట్టుకున్నారు.
మహబూబాబాద్ జిల్లాలో...
నర్సింహులపేట,వెలుగు : కూలీల వెళ్తున్న ఆటోను లారీ ఢీకొట్టడంతో ఓ మహిళ చనిపోగా మరో 13 మందికి గాయాలు అయ్యాయి. ఈ ప్రమాదం మహబూబాబాద్ జ్లిలా నర్సింహుల పేట మండలం పెద్ద నాగారం స్టేజీ శివారులోని జగ్యాతండా వద్ద శుక్రవారం తెల్లవారుజామున జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం...
తొర్రూరు మండలం చర్లపాలెం గ్రామానికి చెందిన గుండెల్లి అరుణ (42)తో పాటు మరో 13 మంది, ఫత్తేపురం గ్రామానికి చెందిన ముగ్గురు కలిసి ఖమ్మం జిల్లాలో మిరపకాయలు తెంపేందుకు ఆటోలో వెళ్తున్నారు. ఈ క్రమంలో జగ్యాతండా సమీపంలోకి రాగానే వెనుక నుండి లారీ ఢీకొట్టింది. ప్రమాదంలో ఆటోలో ఉన్న వారిలో నలుగురు తీవ్రంగా గాయపడగా మిగతా 13 మందికి స్వల్ప గాయాలు అయ్యాయి. ప్రమాదాన్ని గుర్తించిన స్థానికులు గాయపడిన వారిని 108లో మహబూబాబాద్ ఏరియా హాస్పిటల్‌కు తరలించారు. అక్కడ ట్రీట్‌మెంట్ తీసుకుంటూ అరుణ చనిపోయింది.