రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు మృతి

రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు మృతి
  • ఉపాధి వేటలో బాలుడు.. 
  • వదినతో స్కూటీపై వెళ్తూ బాలిక.. 
  • ఆర్టీసీ బస్సు ఢీకొని మరొకరు..

మెహిదీపట్నం, వెలుగు: ఉపాధి కోసం నగరానికి వచ్చిన బాలుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. నేపాల్ దేశానికి చెందిన తాపేందర్ బహుదూర్ (16) 15 రోజుల కిందట పాతబస్తీలోని బహుదూర్ పురాకు వచ్చాడు. మంగళవారం రాత్రి లంగర్ హౌస్ సాలార్జంగ్ కాలనీలోని తమ బంధువుల ఇంటికి వెళ్లాడు. అనంతరం బుధవారం ఉదయం పని కోసం తమ బంధువు సురేశ్​తో కలిసి బైక్​పై వెళ్తుండగా, టోలిచౌకి ఫ్లైఓవర్​పై డివైడర్ ఢీకొని తీవ్రంగా గాయపడ్డారు. బాధితులను గోల్కొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, తాపేందర్ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు లంగర్ హౌస్ సీఐ  తెలిపారు. 

రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తూ.. 

హూమాయున్ నగర్​పరిధిలో ఆర్టీసీ బస్సు ఢీకొని ఒకరు మృతి చెందాడు. సరోజినీ దేవి కంటి ఆసుపత్రి నుంచి మెహిదీపట్నం వైపు గుర్తు తెలియని వ్యక్తి (50) రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా, ఆర్టీసీ బస్సు ఢీకొని అక్కడికక్కడే చనిపోయాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. డెడ్​బాడీని ఉస్మానియా ఆసుపత్రికి తరలించినట్లు సీఐ మల్లేశ్​ తెలిపారు.

చికిత్స పొందుతూ బాలిక..

గచ్చిబౌలి: రోడ్డు ప్రమాదంలో గాయపడిన బాలిక చికిత్స పొందుతూ మృతి చెందింది. నార్సింగి బైరాగిగూడకు చెందిన కేతవత్ అలివేల కూతురు నందు(17) ఈ నెల 4న తన వదిన సునీతతో కలిసి స్కూటీపై పనికి వెళ్లింది. సాయంత్రం 7 గంటలకు పని ముగించుకొని గచ్చిబౌలి నుంచి నార్సింగి వైపు వెళ్తుండగా, 
స్కూటీ టైర్ పంక్చర్ కావడంతో బాలిక కిందపడి గాయపడింది. బాలికను చికిత్స కోసం గాంధీ ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ బుధవారం వేకువజామున మృతి చెందింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ జగదీశ్ తెలిపారు.