గత కొంతకాలంగా తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. పలు చోట్ల వాహనాలు ఢీ కొని కొందరు తీవ్రంగా గాయపడగా..మరికొంత మంది మరణించారు. ఈ క్రమంలో మే 3వ తేదీ బుధవారం పలు చోట్ల ఘోర రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. వరంగల్ జిల్లాలోని వర్ధన్నపేట పట్టణ శివారు పోలీస్ స్టేషన్ సమీపంలో వరంగల్ –ఖమ్మం జాతీయ రహదారిపై స్కూటీ– బైక్ డీకొన్నాయి. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది.
జగిత్యాల జిల్లా మల్యాల సమీపంలోనీ కరీంనగర్ ప్రధాన రహదారిపై రెండు ద్విచక్ర వాహనాలు ఎదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో జగిత్యాల మంచి నీళ్ళ బావికి చెందిన రాము అనే యువకుడు మృతి చెందగా.. మరో యువతికి తీవ్ర గాయలై పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన యువతిని 108 వాహనంలో జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు.
జగిత్యాల జిల్లాలో మరోచోట ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కోడిమ్యాల మండలం కోనాపూర్ శివారులో ఈ ఘటన జరిగింది. డీసీఎం వ్యాను–స్కూటీ ఢీ కొన్న ఘటనలో మేడిపల్లి మండలం రాగోజిపేటకు చెందిన గోకలి అభిషేక్, భీమారం గ్రామానికి చెందిన మోయిన్ ఖాన్ అనే ఇద్దరు యువకులు మృతి చెందారు. మరో యువకుడికి పరిస్థితి విషమంగా మారడంతో కరీంనగర్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. వీరు శుభకార్యానికి క్యాటరింగ్ సర్వీస్ నిమిత్తం వచ్చి.. తిరిగి వెళుతుండగా ప్రమాదం జరిగింది.
మరోచోట సంగారెడ్డి జిల్లా రామచంద్రపురంలో అశోక్ నగర్ యుటర్న్ దగ్గర ఓ డీసీఎం స్కూటీని ఢీకొంది. ఈ ఘటనలో ఒక వ్యక్తి మృతి చెందాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. ప్రమాదాలు జరగకుండా అధికారులు చర్యలు తీసుకున్నపట్టికీ.. వాహనదారుల అజాగ్రత్త.. అతి వేగం కారణంగా రోడ్డు యాక్సిడెంట్ సంభవిస్తున్నాయి.