
- ప్రాణాలు కోల్పోతున్న వాహనదారులు
- నివారణ చర్యలు చేపట్టని అధికారులు
- బ్లాక్ స్పాట్లపై యాక్షన్ మాటలకే..
హనుమకొండ, వెలుగు: వివిధ ప్రాంతాల నుంచి వరంగల్ నగరాన్ని కలిపే రోడ్లు యాక్సిడెంట్లకు కేరాఫ్‌గా మారాయి. రహదారులపై ఇంజినీరింగ్ లోపాలు, హెచ్చరిక బోర్డులు లేని మూలమలుపులు యాక్సిడెంట్లకు కారణమవుతుండగా.. ఎంతోమంది ప్రాణాలు పోతున్నాయి. కమిషనరేట్ రికార్డుల ప్రకారం సగటున రోజుకు నాలుగు యాక్సిడెంట్లు జరిగి, ఒకరు ప్రాణాలు కోల్పోతున్నారు. ఆఫీసర్లు ప్రమాదాల నివారణకు కనీస చర్యలు చేపట్టడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
డేంజర్ గా ఎన్‌హెచ్-563..
ఖమ్మం నుంచి వరంగల్, కరీంనగర్ మీదుగా జగిత్యాల వరకున్న ఎన్‌హెచ్-563 ప్రమాదాలకు నిలయమైంది. ఈ హైవేపై వరంగల్ నగర సమీపంలోని పంథిని శివార్లు యాక్సిడెంట్జోన్ గా మారాయి. ఈ నెల 7న బైక్ పై వెళ్తున్న రమేశ్ అనే యువకుడిని కారు అదుపుతప్పి ఢీకొట్టగా, స్పాట్లోనే చనిపోయాడు. జనవరి 26న రైలు పట్టాలతో వెళ్తున్న లారీ ముందుగా పంథిని వద్ద ఆటోను ఢీకొట్టింది. ఆ తర్వాత మామునూరు వద్ద అదుపు తప్పి ఆటోలపై బోల్తా పడగా, నలుగురు ప్రాణాలు కోల్పోయారు.
ఇదే హైవేపై వరంగల్- కరీంనగర్ మార్గంలో చింతగట్టు రింగ్‌రోడ్డు, ఎర్రగట్టుగుట్ట, నల్లగట్టుగుట్ట, హసన్‌పర్తి పెద్ద చెరువు, ఎల్లాపూర్ బ్రిడ్జి, బావుపేట క్రాస్, అనంతసాగర్ క్రాస్, ఎల్కతుర్తి మండలంలోని కోతులనడుమ తదితర ఏరియాలను గతంలోనే బ్లాక్స్పాట్లుగా గుర్తించారు. అప్పట్లో మూలమలుపుల వద్ద ప్లాస్టిక్కోన్స్ పెట్టి చేతులుదులుపుకోగా, ఇప్పుడు అవి కూడా కనుమరుగై ప్రమాదాలు జరుగుతున్నాయి.
రింగ్ రోడ్డుపై వరుస ప్రమాదాలు..
హైదరాబాద్-భూపాలపట్నం హైవే (ఎన్‌హెచ్-163)పై ప్రమాదాలు నిత్యకృత్యమయ్యాయి. కరుణాపురం నుంచి ఆరెపల్లి వరకున్న 12 గ్రామాలను కలుపుతూ 17 కి.మీల మేర నిర్మించిన ఎన్‌హెచ్-163 బైపాస్‌పై వారానికి ఒకట్రెండు చోట్లైనా యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. ప్రధానంగా కరుణాపురం, రాంపూర్, ఎలుకుర్తి, దేవన్నపేట, చింతగట్టు, పెగడపల్లి, వంగపహడ్ జంక్షన్ల వద్ద తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఎన్‌హెచ్-163 బైపాస్ పై రక్షణ చర్యలు చేపట్టాలని గతంలో దేవన్నపేట గ్రామస్తులు హైవే ఆఫీసర్లకు వినతిపత్రాలు అందించారు. అయినా వారు పట్టించుకున్న దాఖలాలు లేవు. ఇటీవల వరుస యాక్సిడెంట్లు జరగగా, సెంట్రల్ జోన్ డీసీపీ షేక్ సలీమా స్పాట్‌ను విజిట్ చేసి వెళ్లారు.
డెత్ జోన్ @ నిరూప్ నగర్
గ్రేటర్ సిటీ, శివారులో హసన్ పర్తి, కేయూ పీఎస్ పరిధి ప్రాంతమైన నిరూప్ నగర్ తండా పెట్రోల్ బంక్ సమీపంలోని మూలమలుపు డేంజర్ స్పాట్ గా మారింది. ఈ నెల 4న టేకులగూడానికి చెందిన తడుగుల రవి ఇక్కడే బైక్ అదుపు తప్పి డివైడర్ ను ఢీకొట్టి, అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. 7న బైక్ అదుపు తప్పి ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. ఫిబ్రవరి 5న ధర్మసాగర్ మండలం ముప్పారానికి చెందిన మాచర్ల రాజు, గతేడాది మే 5న ధర్మసాగర్ మండలంలో పంచాయతీ కార్యదర్శిగా పని చేసే నాగపురి మహేశ్ ఇదే మూలమలుపు వద్ద బైక్ పై నుంచి పడి ప్రాణాలు కోల్పోయాడు.
అంతకుముందు మరో ఇద్దరు యువకులు కూడా ఇక్కడే ప్రాణాలు కోల్పోయినట్లు స్థానికులు చెబుతున్నారు. ఇక్కడ హసన్ పర్తి పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేసినా, రాత్రిళ్లు మొరం దందా చేసే టిప్పర్లు వాటిని తొలగించడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి.
బ్లాక్ స్పాట్లపై చర్యలు శూన్యం..
వరంగల్ కమిషనరేట్ వ్యాప్తంగా తరచూ ప్రమాదాలు జరుగుతున్న 131 ప్రాంతాలను గతంలోనే బ్లాక్ స్పాట్లుగా గుర్తించినట్లు పోలీసుల రికార్డులు చెబుతున్నాయి. కానీ వాటి వద్ద రక్షణ చర్యలు చేపట్టిన దాఖలాలు కనిపించడం లేదు. యాక్సిడెంట్లు జరుగుతున్న ప్రదేశాలను ఎన్ హెచ్, ఆర్అండ్బీ, పోలీస్ ఆఫీసర్లు విజిట్ చేసి, అక్కడ జాగ్రత్త చర్యలు చేపట్టాల్సి ఉంది. కానీ, ఇక్కడ అదంతా ఏమీ జరగడం లేదు. ప్రమాదాలను నియంత్రణకు రోడ్డు సేఫ్టీ మీటింగ్ కూడా పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
దీంతో కమిషనరేట్ లో ఏటికేడు రోడ్డు ప్రమాదాల సంఖ్య పెరుగుతోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా జిల్లా అధికారులు రోడ్డు ప్రమాదాల నియంత్రణకు యాక్షన్ తీసుకోవాలని, బ్లాక్ స్పాట్లను గుర్తించి తగిన చర్యలు చేపట్టాలని వాహనదారులు కోరుతున్నారు.