రోడ్డెక్కిన పల్లి రైతులు.. ధర తగ్గించారని ఆగ్రహం

రోడ్డెక్కిన పల్లి రైతులు.. ధర తగ్గించారని ఆగ్రహం

 

  • వ్యాపారులు, సిబ్బంది కుమ్మక్కై ధర తగ్గించారని ఆగ్రహం
  • అచ్చంపేట మార్కెట్ ఆఫీసు ముట్టడి.. ఫర్నిచర్ ధ్వంసం 
  • చైర్​పర్సన్​పై పల్లీలు పోసి నిరసన
  • కల్వకుర్తి ఆఫీస్​లోకి దూసుకెళ్లిన రైతులు
  • రోడ్డుపై పల్లీలు వేసి రాస్తారోకో

అచ్చంపేట/కల్వకుర్తి, వెలుగు:  వ్యాపారులు, మార్కెట్ సిబ్బంది కుమ్మక్కై పల్లి ధర తగ్గించేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ అచ్చంపేట, కల్వకుర్తిలో రైతులు ఆదివారం ఆందోళనకు దిగారు. మార్కెట్ కమిటీ ఆఫీసులను ముట్టడించారు. అచ్చంపేట ఆఫీస్ ఫర్నీచర్​ను ధ్వంసం చేశారు. మార్కెట్ కమిటీ చైర్​పర్సన్ అరుణను మహిళా రైతులు పల్లి కుప్పల వద్దకు లాక్కొచ్చారు. అక్కడి నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు తీసుకెళ్లి ధర్నాలో కూర్చోబెట్టారు. అదేవిధంగా, కల్వకుర్తి వ్యవసాయ మార్కెట్ యార్డులోనూ రైతులు నిరసన తెలిపారు. కమిటీ ఆఫీస్​లోకి దూసుకుపోయారు. ధర ఎందుకు తగ్గిస్తున్నారని కార్యదర్శిని నిలదీశారు. రైతుల ఆందోళనకు బీఆర్ఎస్ నేతలు మద్దతు తెలిపారు. 

అచ్చంపేటలో ఒక్కో రైతుకు ఒక్కో ధర

అచ్చంపేట వ్యవసాయ మార్కెట్​కు ఆదివారం రైతులు పెద్దఎత్తున పల్లి పంట తీసుకొచ్చారు. సరుకు ఎక్కువగా రావడంతో వ్యాపారులు ఇదే అవకాశంగా ఇష్టమున్న ధరలు నిర్ణయించారు. 709 మంది రైతులు 32,875 బస్తాల పల్లీలు తెచ్చారు. మోడల్ ధర రూ.6,510 కాగా, కొంత పంటను రూ.7 వేలకు కొన్న వ్యాపారులు.. మిగిలిన వాటికి రూ.4,816 నుంచి రూ.6,500 ధర నిర్ణయించారు. దీంతో ఆగ్రహం చెందిన రైతులు మార్కెట్ ఆఫీస్​ను ముట్టడించి ఫర్నీచర్ ధ్వంసం చేశారు. ఆఫీస్​లో ఉన్న చైర్​పర్సన్ అరుణను మహిళా రైతులు బయటకు లాక్కొచ్చి పల్లి కుప్పల వద్దకు తీసుకెళ్లారు. నెత్తిన పల్లీలు పోసి నిరసన తెలిపారు. తర్వాత అంబేద్కర్ చౌరస్తా వరకు ర్యాలీగా వెళ్లి ధర్నా నిర్వహించారు. వ్యాపారులు, చైర్​పర్సన్, అధికారులు సిండికేట్​గా మారి ఇష్టమున్న ధర నిర్ణయిస్తున్నారని మండిపడ్డారు. దీంతో తాము తీవ్రంగా నష్టపోతున్నామని ఆగ్రహం వ్యక్తం చేశారు. మద్దతు ధర ఇచ్చే వరకు ఆందోళనలు కొనసాగిస్తామని హెచ్చరించారు. వ్యాపారులతో మాట్లాడి న్యాయం చేస్తామని చైర్ పర్సన్ అరుణ, సీఐ రవీందర్, ఎస్ఐలు రాము, రాజు హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.

కల్వకుర్తి మార్కెట్ సిబ్బందిని నిలదీసిన రైతులు

కల్వకుర్తి వ్యవసాయ మార్కెట్​కు 309 మంది రైతులు 12,284 బస్తాల పల్లీలు ఆదివారం తీసుకొచ్చారు. 68 మంది రైతులకు క్వింటాల్​కు రూ.6వేల నుంచి రూ.6,376 వరకు, 78 మందికి రూ.5 వేల నుంచి రూ.5999 వరకు చెల్లించారు. సగం మందికే మోడల్ ప్రైస్​ ఇస్తామనడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మార్కెట్ ఆఫీస్​లోకి చొచ్చుకుపోయారు. కార్యదర్శి సమాచారంతో మార్కెట్​కు వచ్చిన పోలీసులు రైతులను శాంతింపజేయడానికి ప్రయత్నించినా వారు వినలేదు. హైదరాబాద్ చౌరస్తాలో పల్లీలు పోసి రెండు గంటల పాటు ధర్నా చేశారు. సీఐ నాగార్జున, ఎస్ఐలు మాధవ రెడ్డి, మహేందర్ మరోసారి మాట్లాడి నచ్చజెప్పడంతో ఆందోళన విరమించారు.