మేడారం జాతర నాటికి రోడ్డు డౌటే!

మేడారం జాతర నాటికి రోడ్డు డౌటే!
  • ఇంకా కొనసాగుతున్న మంథని రోడ్డు నిర్మాణం 
  • ఇప్పటికే పెరిగిన భక్తుల రద్ధీ
  • రోడ్డు లేక వాహనదారుల ఇబ్బందులు 

పెద్దపల్లి, వెలుగు: మేడారం జాతర కోసం మంథని, అడవి సోమన్​పల్లి నడుమ జరుగుతున్న రోడ్డు నిర్మాణ పనులు జాతరనాటికి పూర్తయ్యేలా కనిపించడం లేదు. జాతర కు ఆర్నెళ్ల ముందే రోడ్లను, రిపేర్లను పూర్తి చేయాల్సింది. కానీ, ఆ దిశగా పనులు కాలేదు. మంథని నుంచిమేడారం వరకు 2016 కు ముందు రోడ్డు నిర్మించారు. ఈ రోడ్డులో ఇసుక లారీలు నడుస్తుండటంతో ఐదేళ్లలో రోడ్డు పూర్తిగా ధ్వంసమైంది.

ప్రస్తుతం రూ. 47 కోట్లతో 14 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణం జరుగుతోంది. మేడారం జాతరకు ముందే రోడ్డు నిర్మాణం జరుగుతుందని భావించారు. కానీ గత బీఆర్ఎస్​ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. తాజా అధికారులు పనులు ప్రారంభించినా జాతర నాటికి నిర్మాణం పూర్తవుతుందా అన్న అనుమానం నెలకొంది. రోడ్డు పూర్తి కాకుంటే జాతరకు వచ్చే వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు ఉంటాయి.

ఫిబ్రవరి 21, 22, 23 న జాతర ఉండగా.. 15 రోజుల ముందు నుంచే జాతర కు భక్తుల తాకిడి ఉంటుంది. ప్రస్తుతం రోజుకు లక్ష మంది భక్తులు వనదేవతలను దర్శనం చేసుకుంటున్నారు. మంథని మీదుగా మేడారం పోయే భక్తుల సంఖ్యే అధికంగా ఉంటుంది. ఈ క్రమంలో రోడ్డు నిర్మాణంలో వేగం పెంచాలని భక్తులు కోరుతున్నారు. జాతర నాటికి రోడ్డు నిర్మాణం పూర్తి కాకపోయినా, ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తామని ఆర్​ అండ్​ బీ అధికారులు చెప్తున్నారు. రోడ్డు పనులు పూర్తి స్థాయిలో కంప్లీట్​ కావడానికి ఇంకా నాలుగు నెలలు పట్టే చాన్స్​ ఉన్నట్లు తెలుస్తుంది. కానీ జాతర కోసం మాత్రం తాత్కాలికంగా రోడ్డును అందుబాటులోకి తీసుకురావడానికి అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. 

ఇప్పటికే లక్షల్లో భక్తులు...

జాతరకు తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు వచ్చి దర్శనం చేసుకుంటారు. ఈ క్రమంలో సర్కార్​ ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఏర్పాట్లు చేస్తుంది. రిపబ్లిక్​ డే సందర్భంగా మూడు రోజుల వరుస సెలవులతో మేడారం జాతరకు భక్తుల తాకిడి పెరిగిపోయింది. రోడ్డు నిర్మాణంలో ఉండటంతో బస్సులు, కార్లల్లో ప్రయాణిస్తున్న భక్తులు చాలా సేపు ట్రాఫిక్​లో ఇరుక్కుపోయారు.

మహరాష్ట్ర, ఆదిలాబాద్​, నిజామాబాద్​, జగిత్యాల, పెద్దపల్లి, కరీంనగర్​ జిల్లాలకు చెందిన భక్తులు మంథని మీదుగానే మేడారం పోవాల్సి ఉంటుంది, దీంతో వేలాది వాహనాలు ఈ రోడ్డులో నడుస్తున్నాయి. రోడ్డు పరిస్థితి చూసి భక్తులు అసంతృప్తి వ్యక్తం చేయడంతో పాటు రోడ్డు నిర్మాణం వెంటనే పూర్తయ్యేలా చూడాలని కోరుతున్నారు.