- ఇసుక లారీల రాకపోకలతో దెబ్బతిన్న భద్రాచలం–-పేరూరు రోడ్డు
- ఇసుక సొసైటీలు, కాంట్రాక్టర్లకూ భారీగా బకాయిలు
- గత బీఆర్ఎస్ సర్కారు నిర్వాకం
భద్రాచలం, వెలుగు : భద్రాచలం నియోజకవర్గంలోని గోదావరి పరివాహకం ప్రాంతంలో ఉన్న ఇసుక ర్యాంపుల నుంచి హైదరాబాద్‌కు వెళ్లే లారీల నుంచి మూడేండ్లుగా రోడ్డు డ్యామేజ్ సెస్ వసూలు చేశారు. కానీ రోడ్లను రిపేర్లు మాత్రం చేయించలేదు. దీంతో భద్రాచలం–పేరూరు రోడ్డు భారీ గుంతలతో ప్రమాదకరంగా మారింది. ఇదే రోడ్డుపై భద్రాచలం నుంచి పర్ణశాలకు వెళ్లే భక్తులు, స్థానిక గ్రామాల ప్రజలు దెబ్బతిన్న రోడ్డుతో ఇబ్బందులు పడుతున్నారు. అలాగే గత బీఆర్ఎస్ సర్కారు టీఎస్ఎండీసీ ద్వారా వసూలు చేసిన డబ్బుల్లో కాంట్రాక్టర్లకు, సొసైటీలకు భారీగా బకాయి పడింది.
కోట్లలో వసూలు..
నిత్యం వందల సంఖ్యలో భారీ లోడ్‌తో వచ్చే ఇసుక లారీలు భద్రాచలం–పేరూరు రహదారిపై నుంచి హైదరాబాద్‌తోపాటు ఇతర ప్రాతాలకు వెళ్తుంటాయి. దీంతో డ్యామేజ్ అయ్యే ఈ రోడ్లను బాగు చేయాలని టీఎస్ఎండీసీ ఇసుక లారీ నుంచి రూ.250ల చొప్పున రోడ్డు డ్యామేజ్ సెస్‌ను రూ. 50కోట్ల నుంచి రూ.70 కోట్ల వరకు వసూలు చేసింది. ఇవన్నీ సర్కారు ఖజానాకే చేరాయి. కానీ నేటికీ ఇవ్వలేదు. అలాగే గడిచిన మూడేళ్ల కాలంలో గత బీఆర్ఎస్ సర్కారు టీఎస్ఎండీసీ ద్వారా వసూలు చేసిన డబ్బుల్లో కాంట్రాక్టర్లకు, సొసైటీలకు రూ.700కోట్ల వరకు బకాయి పడింది.
రోజూ ప్రమాదాలే..
భద్రాచలం-–పేరూరు మార్గంలో ప్రయాణం ప్రమాదభరితంగా మారింది. భద్రాచలం నుంచి పర్ణశాలకు నిత్యం భక్తులు తమ వాహనాల్లో వెళ్తుంటారు. 36 కిలోమీటర్ల ఎటపాక, చింతలగూడెం, సీతంపేట, దుమ్ముగూడెం మండలంలోని లక్ష్మీనగరం, సీతానగరం ఇలా ప్రతీ చోట రోడ్లపై పెద్ద పెద్ద గుంతలు ఉన్నాయి. వీటిని తప్పించే క్రమంలో వాహనాలు ఢీ కొట్టుకుంటున్నాయి. ఇలా రోజుకు ఐదు ప్రమాదాల వరకు జరుగుతున్నాయి.
చర్ల-వెంకటాపురం రోడ్డును తవ్వి వదిలేశారు. అందులో నుంచి బస్సులు కూడా వెళ్లలేకపోతున్నాయి. భద్రాచలం ఆసుపత్రికి రోగులతో వచ్చే అంబులెన్సులు, ఇతర వాహనాల పరిస్థితి దారుణంగా ఉంది. దారిలోనే ప్రాణాలు పోయిన సందర్భాలు ఉన్నాయి.
అడుగడుగునా గుంతలే..
భద్రాచలం–పేరూరు రోడ్డును బాగు చేయండి. అడుగడుగునా గుంతలే. బైక్‌పై వెళ్లాలంటే చుక్కలు కనిపిస్తున్నాయి. రాత్రి పూట ఎక్కువ యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. ఒకవైపు వరదలతో, మరోవైపు ఓవర్ లోడ్‌తో వచ్చే లారీలతో రోడ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి.
- మువ్వా శ్రీనివాసరావు, ఎటపాక
ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం
టీఎస్ఎండీసీ ద్వారా ఇసుక సొసైటీలకు, రోడ్డు డ్యామేజీ సెస్ నిధులు ఆగిపోవడంపై ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. గిరిజన సొసైటీలకు వచ్చే డబ్బులు కూడా ఆగాయి. త్వరలో మీటింగ్ ఉంటుంది. ఈ విషయాలు చెబుతాం. నిధులు వచ్చేలా చొరవ తీసుకుంటాం.
- శ్రీనివాస్, పీవో, టీఎస్ఎండీసీ