మూడేండ్లుగా దుమ్ము ధూళితో తిప్పలు పడుతున్న వనపర్తి జనం

మూడేండ్లుగా దుమ్ము ధూళితో తిప్పలు పడుతున్న వనపర్తి జనం
  • రూ.1.50 కోట్లు మంజూరు చేసి ఫండ్స్​ రూ.50 కోట్లే రిలీజ్​ చేసిన సర్కార్​
  • మున్సిపల్ జనరల్ ఫండ్స్​తో నెట్టుకొస్తున్న ఆఫీసర్లు
  • బిల్లులు వస్తాయో రావోనని ఆందోళన చెందుతున్న కాంట్రాక్టర్లు

వనపర్తి, వెలుగు: వనపర్తి జిల్లా కేంద్రంలో రోడ్ల విస్తరణ పనులు ముందుకు సాగడం లేదు. 2018లో మంత్రి నిరంజన్ రెడ్డి ఈ పనులకు భూమిపూజ చేశారు. వివాదాల నడుమ రోడ్లపై ఆక్రమణలను అధికారులు తొలగించారు. పనులు పూర్తి చేసేందుకు అవసరమైన నిధులు లేక పనులు స్పీడ్​గా జరగడం లేదు. వనపర్తిని జిల్లాగా మార్చడంతో మెడికల్, ఇంజనీరింగ్ కాలేజీలతో పాటు అనేక విద్యాసంస్థలు వచ్చాయి. ఆసుపత్రులు, ప్రభుత్వ, ప్రైవేట్  సంస్థలు పెరగడంతో  ప్రతిరోజు జిల్లా కేంద్రానికి వచ్చిపోయే వారి సంఖ్య రెండు లక్షలకు చేరింది. భవిషత్  అవసరాలకు అనుగుణంగా ట్రాఫిక్, వరద ముప్పు, ఎలక్ట్రికల్ సమస్యలు లేకుండా రోడ్ల విస్తరణ పనులకు అంచనాలు రూపొందించారు. రూ.150 కోట్లు అవసరమవుతాయని ప్రపోజల్స్​ పంపించారు. ఇందులో రూ.50 కోట్లు మాత్రమే రిలీజ్​ చేశారు. మిగిలిన ఫండ్స్​ రిలీజ్​ చేయకపోవడంతో మున్సిపల్​ జనరల్​ ఫండ్స్​తో పనులు చేస్తున్నారు. ఈ నిధులు సరిపోకపోవడంతో కాంట్రాక్టర్లు పనులు స్పీడ్​గా చేస్తలేరు. బ్రిడ్జీల పనులు ఆలస్యమవుతున్నాయి. పట్టణ ప్రజలు దుమ్ము, ధూళితో తిప్పలు పడుతున్నారు. డ్రైన్ ల పక్కనే పోల్స్​ వేసి విద్యుత్ లైన్లు లాగాల్సి ఉన్నా, ఆ పనులు ముందుకెళ్లడం లేదు.

నిధులకు కటకట..

మరో ఆరు నెలల్లో అసెంబ్లీకి ఎన్నికలు రానుండడంతో రోడ్ల విస్తరణ పనులు పూర్తి చేయాలని మంత్రి అధికారులపై ఒత్తిడి పెంచారు. ప్రభుత్వం నుంచి నిధులు రాబట్టే పనిలో పడ్డారు. ఆర్ అండ్ బీ, పంచాయతీరాజ్, మున్సిపల్, ట్రాన్స్ కో అధికారులు పనులు పూర్తి చేయడంపై దృష్టి పెట్టాలని ఆదేశించారు. పట్టణంలోని నాగవరం నుంచి పాత పోలీస్ స్టేషన్ వరకు పనులు పూర్తయ్యాయి. చింతల ఆంజనేయస్వామి ఆలయం వద్ద మినహా చిట్యాల వైపు పనులు చివరి దశకు చేరాయి. రద్దీగా ఉండే గోపాల్ పేట, హైదరాబాద్  రహదారిలో  మిషన్ కాంపౌండ్ నుంచి గాంధీ చౌక్ మీదుగా రాజీవ్ చౌక్ వరకు పనులు పూర్తి కాలేదు. పానగల్ రూట్ లో రోడ్డుపై ఆక్రమణలు తొలగించే పనులు మొదలు పెట్టలేదు. పెబ్బేరు రూట్ లో బీటీ రోడ్డు పనులు జరగాల్సి ఉంది. పాలిటెక్నిక్  కాలేజీకి రెండు వైపులా పనులు చేయాల్సి ఉంది. నిధుల కొరత, ఆక్రమణల తొలగింపులో న్యాయ పరమైన చిక్కులు, అధికార పార్టీ నాయకుల అనవసర జోక్యంతో అధికారులు తిప్పలు పడుతున్నారు.              
రోడ్ల విస్తరణకు మరో రూ.150 కోట్లు అవసరమని అధికారులు అంటున్నారు. రూ.100 కోట్ల వరకు పనులను ఏదో రకంగా పూర్తి చేయాలని భావిస్తున్నారు. అయితే కాంట్రాక్టర్లు పనులు పూర్తి అయ్యాక బిల్లులు రావడం ఆలస్యమైతే తమ పరిస్థితి ఏంటని అంటున్నారు. 

బీఆర్ఎస్  నేతల అత్యుత్సాహం..

రోడ్లపై ఆక్రమణలు తొలగించే విషయంలో బీఆర్ఎస్  లీడర్లు జోక్యం చేసుకోవడంతో తాము ఇబ్బంది పడుతున్నామని అధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకచోట 30 అడుగులు, మరోచోట 35 నుంచి 40అడుగులు పెట్టి బౌండరీ ఫిక్స్  చేయడంపై విమర్శలు ఎదుర్కొంటున్నారు. డ్రైనేజీలు వంకరటింకరగా మారడం విమర్శలకు కారణమవుతోంది. పట్టణంలో ముఖ్యమైన లీడర్ల ఇండ్లను తొలగించకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. 

ఆరు నెలల్లో పూర్తి చేస్తాం

రోడ్డు విస్తరణ పనులకు నిధుల కొరత ఉన్న మాట వాస్తవమే. రూ.50 కోట్లు మంత్రి కేటీఆర్  మెదటి ఫేస్ లో ఇచ్చారు.  మరో రూ.50 కోట్లను మున్సిపల్ సాధారణ నిధులు, ఇతర ప్రభుత్వ శాఖల నుంచి కేటాయించారు. మరో రూ.50  కోట్లు ప్రభుత్వం కేటాయించాల్సి ఉంది. మరో ఆరు నెలల్లో పనులన్నీ కంప్లీట్​ చేస్తాం.
 

- గట్టు యాదవ్, మున్సిపల్  చైర్మన్, వనపర్తి