- రాష్ట్రం నిధులిచ్చినా..కేంద్రం ఫారెస్ట్ పర్మిషన్లు ఇవ్వట్లేదు
- ముందుకు సాగని రోడ్లు, బ్రిడ్జిల నిర్మాణాల పనులు
- ఏజెన్సీ వాసులకు దూర భారంగా ప్రయాణం
- ఎమర్జెన్సీ సమయాల్లోనూ అంబులెన్స్ వెళ్లలేని పరిస్థితి
- ఆటోలు కూడా రాక నడిచిపోతున్నామంటున్న ఆదివాసీలు
ఆసిఫాబాద్, వెలుగు : రాష్ట్ర సర్కార్ నిధులు మంజూరు చేసినా.. ఫారెస్ట్ డిపార్ట్ మెంట్ పర్మిషన్ ఇవ్వకపోతుం డగా కుమ్రంభీమ్ ఆసిఫాబాద్ ఏజెన్సీ గ్రామాల్లో రోడ్ల సౌలతులు కల్పించడం కష్టంగా మారింది. ఇప్పటికే రోడ్ల మెరుగుకు వంతెనలు, కల్వర్టుల నిర్మాణానికి నిధులు వచ్చాయి. కానీ.. ఫారెస్ట్ పర్మిషన్ లేక పనులు నిలిచిపోయాయి. దీంతో ఏజెన్సీ ప్రాంతాల ప్రజలు ఏదైనా పనికోసం.. ఎక్కడికైనా వెళ్లాలంటే ప్రయాణం దూరభారంగా మారింది. ఏజెన్సీ ప్రాంతంలోని మారుమూల పల్లెలకు కనెక్టివిటీ రోడ్లు సరిగా లేకపోవడం సకాలంలో నిత్యవసరాలు, ఎమర్జెన్సీ అయితే వెంటనే వెళ్లలేని పరిస్థితి నెలకొంది.
వ్యవసాయం మీద బతికే ఏజెన్సీ ప్రాంతల ప్రజలు పండించిన పంటలను అమ్ముకోవడానికి అధిక పెట్టుబడి భరించాల్సి వస్తుంది. ఎమర్జెన్సీ సమయాల్లో అంబులెన్స్ కూడా రావడంలేదు. వానాకాలంలో ప్రజల కష్టాలు అన్నీ ఇన్నీ కావు. రాళ్లు రప్పలు, గుంతలు, మట్టి రోడ్లపైనే ప్రయాణిస్తూ నరకయాతన అనుభవిస్తున్నారు. గర్భిణిలను సకాలంలో హాస్పిటల్ కు తీసుకెళ్లలేని దుస్థితి ఉంది.
వందకుపైగా గ్రామాల ప్రజలు ఇబ్బందులు
జిల్లాలో అటవీ ప్రాంతానికి ఆనుకుని ఉన్న జైనూర్, లింగాపూర్, కెరమెరి,తిర్యాణి, వాంకిడి, ఆసిఫాబాద్ మండలాల్లో సరైనా రోడ్డు సౌకర్యాలు లేని గ్రామాలు వందకు పైగానే ఉంటాయి. తిర్యాణి మండలం మంగి, గుండాల, మణిక్యాపుర్, రొంపల్లి ,కౌటగాం గ్రామ పంచాయతీల్లో సుమారు 62 గూడెలు ఉండగా.. మండల కేంద్రానికి, జిల్లా కేంద్రానికి వెళ్లాలంటే సరైన రోడ్డు లేదు. లింగాపూర్ మండలం పిక్లె నాయక్ తండా జముల్ ధార
కాంచన్ పల్లి పంచాయతీ పరిధిలో సుమారు 30 గ్రామాల పరిస్థితి కూడా ఇలాగే ఉంది. జైనూర్ మండలం అడ్డెసార, కిషన్ నాయక్ తాండ ,శివనూన్ పంచాయతీ పరిధిలోని సుమారు 25 గ్రామాల ప్రజలు రోడ్డు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సిర్పూర్ యు మండలం బండెఏర్,శెట్టి హట్నూర్ గ్రామాలకు రోడ్డు కనెక్టివిటీ లేక మట్టి రోడ్డుపైనే ప్రయాణిస్తున్నారు.
ఫారెస్ట్ పర్మిషన్ రాకపోతుండగా..
గ్రామాల కనెక్టివిటీ రోడ్లకు స్థానిక గ్రామాల ప్రజల అధికారులు, ప్రజాప్రతినిధులకు ఎన్నోసార్లు వినతిపత్రాలు ఇచ్చారు. దీంతో గ్రామాలకు రోడ్డు కనెక్టివిటీ కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు నిధులు మంజూరు చేస్తుంది. కానీ.. కేంద్రం మాత్రం ఫారెస్ట్ క్లియరెన్స్ ఇవ్వడం లేదు. దీంతో జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల ప్రజలు మెరుగైన రోడ్డు సౌకర్యానికి నోచుకోవడం లేదు. ఫారెస్ట్ పర్మిషన్లు లేక ఇప్పటికే 33 బ్రిడ్జిలు, 31 రోడ్లు నిర్మాణాలు నిలిచిపోయాయి. పీఎంజీఎస్ వై కింద మంజూరైన 13 రోడ్ల నిర్మాణాలు కూడా క్లియరెన్స్ లేక పనులు చేయడంలేదు.
అధ్వానంగా కనెక్టివిటీ రోడ్లు
చింతలమానేపల్లి మండలం నుంచి గూడెం మీదుగా మహారాష్ట్రలోని అహేరికి రోడ్డు సౌలతు ఉండగా.. ఐదేండ్ల కింద హై లెవెల్ బ్రిడ్జి నిర్మించారు. కర్జేళ్లి నుంచి గూడెం వరకు రోడ్డు మరమ్మతులకు ఫారెస్ట్ ఆఫీసర్లు పర్మిషన్ ఇవ్వడం లేదు. దిందా గ్రామానికి వెళ్లే రోడ్డులో లో లెవెల్ వంతెన నిర్మాణానికి నాలుగేండ్ల కింద రూ. రెండున్నర కోట్లు మంజూరయ్యాయి. ఇప్పటికీ అనుమతులు రాలేదు. వానొస్తే ఆయా గ్రామాల ప్రజల పరిస్థితి చాలా అధ్వానంగా ఉంటుంది. తిర్యాణి మండలం మాణిక్యపూర్ పంచాయతీలోని తిర్యాణి మెయిన్ రోడ్డుకు వెళ్లే మంగి ఫారెస్ట్ కు ఆనుకుని ఉంది.
మధ్యలో ఐదు కిలోమీటర్లు ఫారెస్ట్ క్లియరెన్స్ లేదు. దీంతో 25 కిలోమీటర్ల మేర రోడ్డు వేయడానికి సర్కార్ చర్యలు తీసుకోవడంలేదు. దీనిపై 23 గ్రామాల ప్రజలు రాకపోకలు సాగిస్తుంటారు. రోడ్డు సౌకర్యం ఆయా గ్రామాలు అభివృద్ధికి నోచుకోవడంలేదు. తిర్యాణి మండలం మంగి గ్రామానికి వెళ్లే రోడ్డు రాళ్లు ,రప్పలు, గుంతలతో అధ్వానంగా తయారైంది. నడుచుకుంటూ కూడా వెళ్లలేని పరిస్థితి ఉంది. తిర్యాణి మండల కేంద్రానికి వెళ్లాలంటే. 16 కిలోమీటర్లు. మధ్యలో మంగి అటవీ ప్రాంతంలో నాలుగు కిలోమీటర్లు రోడ్డు వేయడానికి అటవీశాఖ అనుమతులు లేక సాధ్యం పడడంలేదు. మంగి పంచాయతీలోని సుమారు 12 గ్రామాల ఆదివాసీ గూడెలు నడక యాతన పడుతున్న పరిస్థితి ఉంది.
నడుచుకుంటూనే వెళ్తున్నాం
మా గ్రామానికి ఆటోలు కూడా రాలేని పరిస్థితి ఉంది. నడుచుకుంటూనే వెళ్లి వస్తున్నాం. రోడ్డు వేస్తలేరు. చాలా కష్టాలు పడుతున్నాం. గర్భిణులను టైమ్ కి ఆస్పత్రికి తీసుకపోవడం ఇబ్బందిగా మారింది. వానాకాలంలో ఎక్కువగా కష్టాలు పడుతుంటాం. ఇప్పుడైన మా గురించి అధికారులు పట్టించుకోవాలి.
– మెస్రం జంగుబాయి, కేరెగూడ,తిర్యాణి
చేస్తమని చెప్పి చేయలేదు
గ్రామాలకు కనెక్టివిటీ రోడ్లు వేయాలని నేను జడ్పీటీసీ గా ఉన్నప్పుడు ప్రతి జడ్పీ మీటింగ్ లో అడిగాను. ఎంపీ, ఎమ్మెల్యేలకు, ఉన్నతాధికారులకు ఎన్నోసార్లు వినతిపత్రాలిచ్చాం. చేస్తామని చెబుతూనే.. ఆపై అటవీ శాఖ అనుమతులు రావట్లేదని చెప్పి చేయలేదు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ప్రజలకు రోడ్ల సౌలత్ లు కల్పించాలి.
– ఆత్రం చంద్రశేఖర్ , మాజీ జడ్పీటీసీ, తిర్యాణి