వరంగల్ కమిషనరేట్​ లో ఏటికేడు పెరుగుతున్న యాక్సిడెంట్లు

  • కమిషనరేట్​ లో ఏటికేడు పెరుగుతున్న యాక్సిడెంట్లు
  • ప్రాణాలు కోల్పోతున్నవారి సంఖ్యా అధికమే..
  • మాటలకే పరిమితమవుతున్న  నివారణ చర్యలు
  • బ్లాక్​ స్పాట్లను గుర్తిస్తున్నా ఫలితం శూన్యం

హనుమకొండ, వెలుగు: వరంగల్ కమిషనరేట్ లో ఏటికేడు రోడ్డు యాక్సిడెంట్లు పెరిగిపోతున్నాయి. అతివేగం, రోడ్ల నిర్మాణంలో లోపాలు, వాహనదారుల తప్పిదాల వల్ల ప్రమాదాలు ఎక్కువవుతున్నాయి. రోజూ సగటున మూడు ప్రమాదాలు జరుగుతుండగా.. ఒకరు ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రమాదాల నివారణకు ఆఫీసర్లు ఏటా రివ్యూలతో సరిపెడుతున్నారు. దీంతో యాక్సిడెంట్లు కంట్రోల్ కావడం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎప్పటిలాగే రెండ్రోజుల కింద రోడ్డు సేఫ్టీ మీటింగ్​ లో ప్రమాదాల నివారణ కోసం యాక్షన్​ ప్లాన్​ రెడీ చేయగా.. ఇది అమలు అవుతోందో లేదోనన్న సందేహాలు కలుగుతున్నాయి. ఈ రివ్యూలో డివైడర్ల నిర్మాణంతో పాటు కొన్నిచోట్ల రోడ్లు విస్తరించాలని, మరికొన్ని చోట్ల జంక్షన్లు డెవలప్​ చేసి సిగ్నలింగ్​ వ్యవస్థను పటిష్టం చేయాలని ప్రపోజల్స్ పెట్టారు. ఈ ఏడాది కూడా మళ్లీ బ్లాక్​ స్పాట్లను గుర్తించి, ప్రమాదాల నివారణకు కొన్ని ప్రపోజల్స్​ రెడీ చేశారు. ఏటా ప్రపోజల్స్​ తప్ప..  యాక్షన్ ప్లాన్ అమలు చేయడం లేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 

24 బ్లాక్​ స్పాట్ల గుర్తింపు

కమిషనరేట్​ పరిధిలో రోడ్డు యాక్సిడెంట్లతో పాటు ప్రాణాలు కోల్పోతున్నవారి సంఖ్య కూడా పెరిగిపోతోంది. కమిషనరేట్ లో గత మూడేండ్ల నుంచి పరిశీలిస్తే ప్రమాదాల సంఖ్య విపరీతంగా పెరిగింది. 2020లో మొత్తంగా హనుమకొండ జిల్లాలో 672 యాక్సిడెంట్లు జరగగా.. 238 మంది చనిపోయారు. నిరుడు 812 ప్రమాదాల్లో 304 మంది మృత్యువాతపడ్డారు. ఇలా హనుమకొండ, వరంగల్ జిల్లాల్లో ప్రమాదాలు ఎక్కువగా జరుగుతుండడంతో ఈ రెండు జిల్లాల్లో  ఆఫీసర్లు బ్లాక్​ స్పాట్లను గుర్తించారు.  వరంగల్​ జిల్లాలో 10, హనుమకొండ జిల్లాలో 14 ప్రాంతాలను గుర్తించి, ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవడానికి ప్లాన్​ రెడీ చేశారు. నిరుడు సైతం ఇదే తీరుగా ప్రమాదాల నియంత్రణకు ఆఫీసర్లు ప్లాన్​ రెడీ చేసి దాదాపు 18 ఏరియాలను బ్లాక్​ స్పాట్లుగా గుర్తించారు. కానీ ప్రమాదాల నివారణకు మాత్రం పూర్తి స్థాయి చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యారు.  కొన్ని చోట్ల జీబ్రా క్రాసింగ్​లు, డ్రమ్ములు ఏర్పాటు చేయడం మినహా పెద్దగా చర్యలేమీ తీసుకోలేదు.

బ్లాక్​ స్పాట్లు ఇవే..

హనుమకొండ జిల్లాలో రాంపూర్​ క్రాస్​ రోడ్డు, ఓఆర్​ఆర్​పై టేకులగూడెం, దేవన్నపేట, వంగపహాడ్​, కాజీపేట జంక్షన్​ నుంచి ఫాతిమానగర్​, వడ్డేపల్లి క్రాస్​ రోడ్డు నుంచి జులైవాడ, నక్కలగుట్ట జంక్షన్​, మర్కజి స్కూల్​ నుంచి అలంకార్​ జంక్షన్​, పెద్దమ్మగడ్డ, హంటర్​ రోడ్డు రాజ్​ హోటల్​ నుంచి సీఎస్​ఆర్​ గార్డెన్​, భీమారం నుంచి చింతగట్టు క్యాంపు, హసన్​ పర్తి పెద్ద చెరువు, ఎల్లాపూర్​ బ్రిడ్జి నుంచి బావుపేట క్రాస్, ములుగు రోడ్డు నుంచి హనుమాన్​ జంక్షన్​ ఐశ్వర్య గార్డెన్స్, ఆరెపల్లి అయ్యప్పస్వామి టెంపుల్ లను బ్లాక్ స్పాట్​ గా గుర్తించారు. ఇక వరంగల్ జిల్లాలో గోపాలస్వామి టెంపుల్ నుంచి పోచమ్మ మైదాన్​, వెంకట్రామ జంక్షన్​, బూడిదగడ్డ జంక్షన్​ నుంచి ఫోర్ట్ రోడ్డు, ఆర్టీవో ఆఫీస్​ జంక్షన్​ నుంచి మామునూరు చెరువు, ధర్మారం, ఇల్లంద, రాయపర్తి, మైలారం ఔట్​ స్కర్ట్స్​, నర్సంపేట ఎంజేఆర్​ రైస్​ మిల్​ క్రాస్​, గిర్నిబావి సెంటర్​లను బ్లాక్ స్పాట్లుగా గుర్తించారు. ఆయా చోట్ల ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నట్లు గుర్తించారు.

తాత్కాలికమేనా..

రోడ్ సేఫ్టీ కమిటీ రూపొందించిన యాక్షన్ ప్లాన్​ను అమలు చేయడంలో ఆఫీసర్లు ఫెయిల్ అవుతున్నారు. ఒకట్రెండు రోజులు మాత్రమే తాత్కాలిక చర్యలు చేపడుతున్నారు. ఆ తరువాత లైట్​ తీసుకుంటున్నారు. ఫలితంగా యాక్సిడెంట్ల నివారణకు అడుగులు పడడం లేదు. ఇకనైనా జిల్లా స్థాయి ఆఫీసర్లు పకడ్బందీగా ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

డెత్ రేటు తగ్గేనా?​

రోడ్డు యాక్సిడెంట్లు, ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య పెరిగిపోతుండటంతో ఇటీవల సుప్రీంకోర్టు కొత్తగా రాష్ట్రాలకు నిబంధనలు విధించింది. ఈ ఏడాది 10 శాతం మరణాలు తగ్గించాలని ఆదేశించింది. దీంతోనే  పోలీస్​, ఆర్టీఏ, ఆర్​ అండ్ బీ, ఎన్​హెచ్​, జీడబ్ల్యూఎంసీ తదితర డిపార్ట్​మెంట్ల ఆఫీసర్లతో కూడిన రోడ్డు సేఫ్టీ కమిటీ ప్రమాదాల నివారణకు యాక్షన్​ ప్లాన్​ రెడీ చేసింది. ఈ మేరకు కమిషనరేట్​కు సంబంధించిన పోలీస్​ ఆఫీసర్లు యాక్సిడెంట్లలో ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య తగ్గించేందుకు కేవలం హెల్మెట్లపైనే ఫోకస్​ పెట్టారు. ఎక్కడికక్కడ అడ్డాలు పెట్టి వాహనదారులకు ఫైన్లు విధిస్తున్నారు తప్ప రోడ్లలోని ఇంజినీరింగ్​ లోపాలు, ఇతర కారణాలను విశ్లేషించడం లేదు. అంతేగాకుండా వరంగల్ నగరంలో దాదాపు పది చోట్ల రోడ్లను విస్తరించాల్సి ఉంది. కానీ దానిపై‌‌‌‌ పెద్దగా ఎవరూ దృష్టి పెట్టడం లేదు. దీంతోనే ప్రమాదాలు యథావిధిగా జరుగుతూనే ఉన్నాయి.. వందల ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయి.