జయశంకర్ భూపాలపల్లి/వెంకటాపురం, వెలుగు : పైసలు కట్టినా... పర్మిషన్ లేదంటూ ఫారెస్ట్ ఆఫీసర్లు అడ్డుకుంటుండడంతో భూపాలపల్లి జిల్లాలోని నాలుగు గ్రామాల ప్రజలు రోడ్డు సౌకర్యానికి దూరం అవుతున్నారు. అత్యవసర పరిస్థితుల్లో వాగులు, వంకలు దాటుకుంటూ రావాల్సి వస్తుండడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక వర్షాకాలంలో అయితే ఆ నాలుగు గ్రామాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు పూర్తిగా తెగిపోతున్నాయి.
రూ. 13.66 కోట్లతో రోడ్డు నిర్మాణం
ములుగు జిల్లా వెంకటాపురం మండలం తిప్పాపురం పంచాయతీలోని కొత్తగుంపు, తిప్పాపురం, కలిపాక, పెంకవాగు గ్రామాలకు సరైన రోడ్డు లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో రోడ్డు నిర్మాణానికి మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల అభివృద్ధి నిధుల నుంచి రూ.13.66 కోట్లను కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. ఈ నిధులతో బోదాపురం నుంచి తిప్పాపురం వరకు రోడ్డు నిర్మాణంతో పాటు, జిన్నెల వాగు, పెంకవాగుపై బ్రిడ్జి నిర్మించాలని నిర్ణయించారు. ఈ పనులకు 2017 – 18లో పంచాయతీరాజ్ శాఖ ఆఫీసర్లు టెండర్లు పిలిచారు. అగ్రిమెంట్ అనంతరం కాంట్రాక్టర్ పనులు స్టార్ట్ చేశాడు.
సీనరేజీ కింద రూ. 60 లక్షలు చెల్లింపు
పెంకవాగు, తిప్పాపురం, కొత్త గుంపు గ్రామాల్లో కొంత మేరకు పనులు పూర్తయ్యాయి. ఆయా గ్రామాలను అనుసంధానం చేసేందుకు ఫారెస్ట్ ఏరియాలో 2.43 కిలోమీటర్ల రోడ్డు నిర్మించాల్సి ఉంది. ఇందుకోసం పంచాయతీ రాజ్ శాఖ ఆఫీసర్లు సీనరేజీ కింద ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్‌కు రూ. 60 లక్షలు చెల్లించారు. అయినా పర్మిషన్ లేదంటూ ఫారెస్ట్ ఆఫీసర్లు పనులను అడ్డుకుంటున్నారు. పనులు పూర్తి చేసేందుకు వారం కింద కాంట్రాక్టర్ మెటల్, గ్రావెల్ తెచ్చారు. దీంతో పర్మిషన్ లేకుండా రోడ్డుపై గ్రావెల్ పోశారంటూ ఫారెస్ట్ ఆఫీసర్లు ఆ గ్రావెల్‌ను బయటకు నెట్టేశారు. దీంతో పెంకవాగు బ్రిడ్జి పనులు, కొంత దూ రం రోడ్డు పనులు ఎక్కడికక్కడే ఆగిపోయాయి.
ఇబ్బందులు పడుతున్న గిరిజనులు
తిప్పాపురం పంచాయతీలోని 4 గిరిజన గ్రామాల ప్రజలు విద్య, వైద్యం, పని కోసం అలుబాక, వెంకటాపురం, చర్ల, భద్రాచలం వెళ్తుంటారు. ఈ గ్రామాలకు రోడ్డు సౌకర్యం లేకపోవడంతో వాగులు దాటాల్సి వస్తోంది. గతేడాది మిడెం బతకయ్య అనే వ్యక్తి పెంకవాగు దాటుతూ నీటిలో కొట్టుకుపోయాడు. 2019 ఆగస్టులో కురిసిన వర్షాల వాగులు ఉప్పొంగడంతో నలుగురు పశువుల కాపరులు వాగులో చిక్కుకున్నారు. వరద ఉధృతి తగ్గకపోవడంతో కాలినడకన ఛత్తీస్‌గఢ్ వెళ్లి అక్కడి నుంచి భద్రాద్రి కొత్తగూడెం, ఉంచుపల్లి మీదుగా ఆలుబాక చేరుకున్నారు.
పనులు పూర్తయితే కష్టాలు తీరుతాయ్
బోదాపురం నుంచి తిప్పాపురానికి రోడ్డు వేస్తే మా కష్టాలు తీరుతాయి. సంవత్స రాలు గడుస్తున్నా పనులు చేస్తలేరు. వర్షాకాలంలో వాగులు పొంగడంతో ఇబ్బందులు పడుతున్నాం. అత్యవసర పరిస్థితిలో 108 కూడా రావడం లేదు.
‒ మడకం చందర్‌రావు, కొత్తగుంపు