- మేడారం రోడ్డుకు అటవీ చిక్కులు
- డాంబర్ రోడ్డు కోసం అనుమతులు తేవడంలో ఆఫీసర్ల నిర్లక్ష్యం
- నాలుగు రాష్ట్రాల భక్తులకు మట్టి రోడ్లే దిక్కు
- గోవిందరాజులను గద్దెకు తీసుకొచ్చేదీ ఈ రోడ్డు ద్వారానే
- ఎనిమిదేండ్లయినా అసంపూర్తిగా పనులు
జయశంకర్ భూపాలపల్లి/ఏటూరు నాగారం/వెలుగు : మేడారం మహా జాతరకు అటవీ చిక్కులు తప్పడం లేదు. పొరుగున ఉన్న మహారాష్ట్ర, ఛత్తీస్ గఢ్, ఆంధ్రప్రదేశ్ తో పాటు మధ్యప్రదేశ్ నుంచీ మేడారం జాతరకు లక్షలాది భక్తులు తరలివచ్చే రోడ్డు నిర్మాణం ఎనిమిదేండ్లయినా పూర్తి కాలేదు. ఇప్పటికే వందల కోట్లు ఖర్చు చేసినా మట్టి రోడ్డు నుంచి తారు రోడ్డుగా మార్చలేని పరిస్థితి. గోవిందరాజులను గద్దెపైకి తీసుకొచ్చేది ఈ మట్టి రోడ్డు ద్వారానే. ప్రతి జాతర ముందు హడావుడి చేసే ఆఫీసర్లు, ఆ తర్వాత ఫారెస్ట్ పర్మిషన్ల కోసం ప్రయత్నించకపోవడం వల్ల భక్తులకు తిప్పలు తప్పడం లేదు. ఈసారైనా అనుమతి తీసుకొని బీటీ రోడ్డు నిర్మించాలని భక్తులు కోరుతున్నారు.
ఎనిమిదేళ్ల కింద రూ.29 కోట్లు కేటాయింపు
మేడారం మహా జాతరకు వచ్చే భక్తులను ఏటూరునాగారం మండలం చిన్నబోయినపల్లి దగ్గర 163 నేషనల్ హైవే దగ్గర క్రాస్ చేసి పంపిస్తారు. ఈ మార్గంలో వేలాది వాహనాలు, ఎడ్లబండ్లు ప్రయాణిస్తాయి. చిన్నబోయినపల్లి నుంచి మేడారం వరకు మొత్తం 29 కిలోమీటర్ల దూరంలో చిన్నబోయినపల్లి నుంచి మల్యాల వరకు 15 కిలోమీటర్ల సింగిల్ బీటీ రోడ్డు, ఊరట్టం నుంచి మేడారం వరకు 3 కిలోమీటర్ల డబుల్ రోడ్డు ఉంది. మధ్యలో మల్యాల నుంచి ఊరట్టం వరకు 11 కిలోమీటర్లు దూరం మట్టి రోడ్డే దిక్కు. ఈ మట్టి రోడ్డును బీటీ రోడ్డుగా మార్చడానికి 2016లో అప్పటి బీఆర్ఎస్ సర్కారు రూ.29 కోట్లు కేటాయించింది. కానీ అటవీ శాఖ అనుమతులు లేకపోవడంతో పనులు మధ్యలోనే ఆగిపోయాయి. గడిచిన ఎనిమిదేళ్లుగా అటవీ అనుమతులు తెప్పించడంలో ఆర్ అండ్ బీ ఆఫీసర్లు చొరవ తీసుకోలేదు.
ఈసారైనా అనుమతులు వచ్చేనా?
మేడారం మహాజాతర తొలి రోజు సారలమ్మతో పాటు పగిడిద్దరాజు, గోవిందరాజులను గిరిజన పూజారులు మేడారం గద్దెలపైకి తీసుకొస్తారు. ఇది కీలకమైన ఘట్టం. కొండాయిలోని గోవిందరాజుల గుడి నుంచి ఊరట్టం వరకు 9.5 కిలోమీటర్లు ఈ మట్టి రోడ్డు మీదుగానే గిరిజన పూజారులు గోవిందరాజులును తీసుకురావాల్సి వస్తోంది. ఊరట్టం, కొండాయి మద్య ఉన్న కొండ్రెడు వాగుపై బ్రిడ్జి కూడా లేదు. దీంతో గిరిజన పూజారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 40 ఏండ్లుగా ఇదే పరిస్థితి ఉందని పూజారులు, భక్తులు వాపోతున్నారు. ఈ క్రమంలోనే మల్యాల నుంచి ఊరట్టం వరకు ఉన్న మట్టి రోడ్డును డాంబర్ రోడ్డుగా మార్చాలని కొండాయి, కొత్తూరు, దొడ్ల, షాపెల్లి తదితర గ్రామస్థులు ఏండ్లుగా పోరాడుతున్నారు. అయినప్పటికీ అధికారుల్లో స్పందన లేదు. ఈసారి మేడారం జాతర కోసం రాష్ట్ర సర్కారు రూ.105 కోట్లు విడుదల చేయడంతో అటవీ శాఖ నుంచి అనుమతులు తీసుకొని బీటీ రోడ్డు వేయాలని గ్రామస్థులు, పూజారులు, సమ్మక్క భక్తులు కోరుతున్నారు.
రోడ్డు కోసం పోరాటాలు చేస్తూనే ఉన్నం
మహా జాతర సమయంలో మట్టి రోడ్డు ద్వారా గోవిందరాజులను తీసుకెళ్లేటపుడు చాలా ఇబ్బంది అవుతోంది. ప్రభుత్వం ఫారెస్ట్ ఆఫీసర్లతో మాట్లాడి సమస్యను పరిష్కరించి పూర్తి స్థాయిలో డాంబర్ రోడ్డు వేయాలి. జాతరకు అధిక సంఖ్యలో ప్రైవేటు వాహనాలు ఈ మార్గంలోనే పోతాయి. రోడ్డు నిర్మాణానికి 2016లోనే నిధులు మంజూరైనా ఎనిమిదేండ్లుగా అటవీ అధికారులు పనులను అడ్డుకుంటున్నారు.
- కాక వెంకటేశ్వర్లు, కొండాయి సర్పంచ్, ఏటూరు నాగారం మండలం
తాత్కాలిక రోడ్డు ఉండకపోవచ్చు
గతంలో కురిసిన భారీ వర్షాలకు జంపన్న వాగులో కూలిన బ్రిడ్జిని వెంటనే తిరిగి నిర్మించాలి. అసెంబ్లీ ఎన్నికల సమయంలో వేసిన తాత్కాలిక రోడ్డు చిన్నపాటి వర్షానికే కొట్టుకుపోయింది. మళ్లీ ఇప్పుడు మహా జాతర కోసం తాత్కాలిక రోడ్డు వేసిన్రు. వరద ఉధృతికి ఈ రోడ్డు కూడా కొట్టుకుపోయే ప్రమాదం ఉంది.
- పి.ఎల్లయ్య, మల్యాల, ఏటూరు నాగారం మండలం