నిర్మాణ పనుల్లో సాగదీత
ఏళ్లు గడుస్తున్నా కంప్లీట్ కాని వైనం
ఇబ్బంది పడుతున్న ప్రయాణికులు
కామారెడ్డి జిల్లాలో రూ.50 కోట్లతో చేపట్టిన రోడ్ల నిర్మాణ పనులు అస్తవ్యస్తంగా మారాయి. కోట్లాది రూపాయలతో చేపట్టిన పనులను కాంట్రాక్టర్లు మధ్యలో ఆపేసినా ఆఫీసర్లు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. గాంధారి, లింగంపేట, నాగిరెడ్డిపేట మండలాల్లోని పలు రోడ్ల నిర్మాణాలు మధ్యలోనే ఆగిపోగా.. కొన్ని చోట్ల కంప్లీట్ అయిన కొద్ది రోజులకే బీటీ కొట్టుకుపోయి గుంతలు ఏర్పడుతున్నాయి. దీంతో ప్రయాణికులకు నిత్యం ఇబ్బందులు తప్పడం లేదు. – కామారెడ్డి, వెలుగు
ఇది గాంధారి మండలం రాంపూర్ గడ్డ నుంచి మాతుసంగెం మీదుగా లింగంపేట వెళ్లే రోడ్డు. రూ.28 కోట్లతో చేపట్టిన ఈ పనులు మూడేళ్లు కావస్తోంది. సగ భాగం బీటీ వేసి వదిలేశారు. కల్వర్టు దగ్గర అసంపూర్తిగా ఉండడంతో ప్రయాణికులు ప్రమాదాల బారిన పడుతున్నారు.
కామారెడ్డి– ఎల్లారెడ్డి మెయిన్ రోడ్డు నుంచి లింగంపేట మండలం నల్లమడుగు వరకు డబుల్ రోడ్డు నిర్మాణానికి ఏడాది కింద రూ. 9 కోట్ల ఫండ్స్ సాంక్షన్ అయ్యాయి. టెండర్ల దశ ఇంకా కంప్లీట్ కాలేదు. పనులు చేపట్టేందుకు కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదని తెలుస్తోంది. నల్లమడుగు నుంచి గాంధారి మండలం రాంలక్ష్మణ్‌పల్లి వరకు ఉన్న బీటీ రోడ్డు పలు చోట్ల గుంతలు ఏర్పడింది. మధ్యలో కాజ్ వే ప్రమాదకరంగా మారింది. సైడ్ వాల్స్ పడిపోయాయి. వానకాలంలో భారీ వర్షాలకు కాజ్వే పక్కన మట్టి కొట్టుకుపోయింది. రాత్రి వేళ్లలో వెహికల్స్కాజ్ వే మీదుగా వెళ్లడం ప్రమాదకరంగా ఉంది.
లింగంపేట మండలం మెంగారం శివారులో మెయిన్ రోడ్డు నుంచి షెట్‌పల్లి, షెట్‌పల్లి సంగారెడ్డి, పర్మల మీదుగా నాగిరెడ్డిపేట మండలం వదల్‌పర్తి, లొంకపల్లి చౌరస్తా నుంచి మాల్ తుమ్మెద వరకు రోడ్డు నిర్మాణం జరిగింది. ఈ పనులు నాలుగేళ్ల సాగి ఇటివలే కంప్లీట్ అయ్యాయి. పనులు జరిగిన కొద్ది రోజులకే పలు చోట్ల గుంతలు పడ్డాయి. దోమకొండ మండల కేంద్రం నుంచి ముత్యంపేట మీదుగా కామారెడ్డి మండలం క్యాసంపల్లి చౌరస్తా నుంచి మెయిన్ రోడ్డు వరకు రోడ్డు గుంతలు పడి రాకపోలకు ఇబ్బంది కలుగుతోంది. ముత్యంపేట శివారులో రెండేళ్ల కింద నిర్మించిన కాజ్ వే పగుళ్లు ఏర్పడింది.