కేపీహెచ్​బీలో దారి దోపిడీ ముఠా హల్​చల్​

  • అర్ధరాత్రి కత్తులతో బెదిరించి దోచుకుంటున్న దుండగులు
  • పోలీసులను ఆశ్రయించిన బాధితులు

కూకట్​పల్లి, వెలుగు : కేపీహెచ్​బీ పరిధిలో అర్ధరాత్రి దారి దోపిడీ ముఠా హల్​చల్​ చేస్తోంది. ఈ నెల 12న అరగంట వ్యవధిలో ఇద్దరు వ్యక్తులను దుండగులు కత్తులతో బెదిరించి అందినంత దోచుకున్నారు. జగద్గిరిగుట్టలోని వెంకటేశ్వరనగర్​కు చెందిన మురహరిశెట్టి అంకమరావు పనిమీద మూసాపేటలోని కైత్లాపూర్​కు వెళ్లి ఇంటికి వెళ్తున్నాడు. మంగళవారం రాత్రి 12 గంటల సమయంలో లోథ అపార్ట్​మెంట్స్​ వద్ద అతడి బైక్​ను కొందరు ట్రాన్స్​జెండర్లు​ఆపారు. ఇక్కడ రౌడీలు తిరుగుతున్నారని, వెంటనే వెళ్లిపోవాలని సూచించారు.

దీంతో ఆయన వెంటనే బైక్​ తీసుకుని కొద్ది దూరం వెళ్లగానే, బైక్​ మీద ఇద్దరు వ్యక్తులు వచ్చి అంకమరావుకు అడ్డుపడ్డారు. మరో వ్యక్తి వెనుక నుంచి వచ్చి అతడిని కదలకుండా చేశాడు. అనంతరం బాధితుడిని కత్తులతో బెదిరించి ఒకటిన్నర తులం గోల్డ్​చైన్, సెల్​ఫోన్, బైక్​కీస్​ లాక్కుని పరారయ్యారు. ఇది జరిగిన కొద్దిసేపటి ఇదే రోడ్డులో మరో దోపిడీ జరిగింది. తూర్పు గోదావరి జిల్లా కపిలేశ్వరానికి చెందిన కె.వెంకట సురేశ్​(28) ఇటీవల బోరబండ మోతీనగర్​లోని తన ఫ్రెండ్​ వద్దకు వచ్చాడు.

వీరిద్దరూ మంగళవారం రాత్రి డిన్నర్​చేయడానికి కేపీహెచ్​బీ కాలనీకి వెళ్లి తిరిగివస్తున్నారు. ఈ క్రమంలో వీరి బైక్​ను నలుగురు వ్యక్తులు వెంబడించి ఆపారు. వారి వద్ద డబ్బులు లేకపోవడంతో బెదిరించి పరారయ్యారు. ఈ ఘటనలపై బాధితులు ఇచ్చిన ఫిర్యాదులతో కేపీహెచ్​బీ పోలీసులు కేసు నమోదు చేసి 
దర్యాప్తు చేస్తున్నారు.