తర్నం బ్రిడ్జికి ప్రత్యామ్నాయంగా రోడ్డు విస్తరణ

ఆదిలాబాద్, వెలుగు: రెండు నెలల కిందట జైనథ్ మండలంలోని తర్నం బ్రిడ్జి కుంగిపోయింది. రాకపోకలు నిలిచిపోయాయి. అంతరాష్ట్ర రోడ్డు కావడంతో వెహికల్స్​ను ఇతర గ్రామాల నుంచి మళ్లిస్తున్నారు. బ్రిడ్జి నిర్మాణం పూర్తయ్యే వరకు ప్రత్యామ్నాయ మార్గం కోసం కేంద్ర ప్రభుత్వం ఇటీవల సీఆర్ఐఎఫ్ (సెంట్రల్​ రోడ్ ఇన్ఫాన్ఫస్ర్టక్చర్ ​ఫండ్) రూ. 44 కోట్లు మంజూరు చేసింది. ఈ నిధులు ఎమ్మెల్యే జోగురామన్న చొరవ ద్వారా మంజూరయ్యాయని బీఆర్ఎస్ లీడర్లు ప్రచారం చేశారు. కేంద్రం నిధులిస్తే కనీస అవగాహన లేకుండా రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిందంటూ ప్రచారం చేసుకోవడం ఏమిటని బీజేపీ లీడర్లు మండిపడుతున్నారు.

ఎంపీ సోయం బాపురావు,  బీజేపీ జిల్లా అధ్యక్షుడు పాయల్ శంకర్​ప్రెస్​మీట్​పెట్టిమరీ కేంద్రం నిధులు ఇచ్చిందని వెల్లడించారు. దీంతో నాలుగు రోజుల నుంచి ఫండ్స్ పై రెండు పార్టీల మధ్య పంచాయితీ మొదలైంది. స్థానిక ఎంపీ పలుమార్లు కేంద్రానికి విన్నవించడంతోనే రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయని బీజేపీ లీడర్లు చెబుతున్నారు.  

రూ. 44.20 కోట్లు మంజూరు..

తర్నం బ్రిడ్జిపై నుంచి వెళ్లే వెహికల్స్ ను లాండసాంగ్వి నుంచి మళ్లిస్తున్నారు. ప్రస్తుతం ఈ రోడ్డు పంచాయతీ రాజ్ పరిధిలో ఉన్నా దీన్ని విస్తరించేందుకు  కేంద్రం రూ.44.20 కోట్లు మంజూరు చేసింది. తర్నం బ్రిడ్జి నిర్మాణానికి సైతం రూ.499 కోట్లు మంజూరైనా ఇంకా టెండర్ దశలోనే ఉంది. పనులు ఇప్పట్లో ప్రారంభమయ్యేలా లేవు. ఈ క్రమంలో ప్రత్యామ్నాయంగా రోడ్డు ను ఇప్పుడున్న 3 మీటర్ల నుంచి 7 మీటర్లకు పెంచనున్నారు. 15 కిలోమీటర్ల మేర ఉన్న ఈ రోడ్డు అంతర్రాష్ట్ర వాహనాలను నడుస్తుండటంతో హైవే అధికారులు రోడ్డు పనులు చేపట్టనున్నారు. రోడ్డు మొత్తం పూర్తయ్యేందుకు ఏడాదిన్నర సమయం పట్టే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం టెండర్లు పిలిచి పనులు ప్రారంభించాడానికి మరో నెల రోజులు పడుతుంది. 

ఆది నుంచి ఆందోళనలే..

జైనథ్ మండలంలోని తర్నం బ్రిడ్జి గత ఫిబ్రవరిలో పగుళ్లు వచ్చి కుంగిపోయింది. ఆదిలాబాద్ నుంచి మహారాష్ట్ర వెళ్లే ఈ రోడ్డు గుండా నిత్యం భారీ వెహికల్స్ తో పాటు వేల సంఖ్యలో ప్రయాణికులు వెళ్తుంటారు. బ్రిడ్జి కుంగిపోయిన విషయం తెలుసుకున్న బీజేపీ లీడర్లు అదే రోజు ఆందోళనకు దిగారు. 2018లో నే బ్రిడ్జిని తొలగించి కొత్తగా నిర్మించాల్సి ఉన్నా గవర్నమెంట్​ అలసత్వం వల్ల పనులు ముందుకు సాగలేదని బీజేపీ జిల్లా అధ్యక్షుడు పాయల్ శంకర్ మండిపడ్డారు. బ్రిడ్జి నిర్మాణ బాధ్యత కేంద్రం తీసుకోవడం లేదంటూ ఇటు బీఆర్ఎస్ లీడర్లు విమర్శించారు. ప్రత్యామ్నాయ మార్గంగా గుండా ప్రయాణం దూరభారం కావడంతో పాటు ఆయా గ్రామాల మీదుగా భారీ వెహికల్స్​వెళ్లడంతో గ్రామస్తులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

త్వరలో టెండర్లు..

ఆదిలాబాద్ నుంచి లాండసాంగ్వి మీదుగా 15 కిలోమీటర్ల రోడ్డు విస్తరణ కోసం రూ.44 కోట్లు మంజూరయ్యాయి. త్వరలో వీటికి టెండర్లు ఖరారు చేసి పనులు ప్రారంభిస్తాం. పనులు పూర్తయిన  తర్వాత ఆర్అండ్​బీకి అప్పగిస్తాం.
సుభాష్, డీఈ, ఎన్ హెచ్ సబ్ డివిజన్, నిర్మల్