
దుబ్బాక, వెలుగు: దుబ్బాకలో చేపట్టిన రోడ్డు విస్తరణ పనులను స్థానికులు అడ్డుకున్నారు. నోటీసులు ఇవ్వకుండా, దండోరా వేయకుండా రోడ్డు విస్తరిస్తామంటే ఊరుకోబోమన్నారు. దుబ్బాకలోని అంబేద్కర్చౌరస్తా నుంచి కేసీఆర్ స్కూల్ వరకు రోడ్డు విస్తరించాలని అధికారులు నిర్ణయించారు.
అందులో భాగంగా బుధవారం కొలతలు తీసుకునేందుకు అధికారులు రాగా, స్థానికులు అడ్డుకున్నారు. రోడ్డు విస్తరణలో తాము ఇండ్లు కోల్పోతామని చెప్పారు. కొందరి ఇండ్లు పూర్తిగా పోయే అవకాశం ఉందన్నారు. కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి వస్తుందని, తగ్గించి మార్క్చేయాలని డిమాండ్చేశారు. పరిహారం ప్రకటించకుండానే కొలతలు వేయడమేంటని ప్రశ్నించారు. దీంతో మార్కింగ్చేయకుండానే అధికారులు వెనుదిరిగారు.