కరీంనగర్, వెలుగు: కరీంనగర్ సిటీలో తమ ఇంటి ముందు రోడ్డు లేదని ఎవరడిగినా తక్షణమే రోడ్డు మంజూరు చేస్తామని బీసీ వెల్ఫేర్, సివిల్ సప్లైస్ శాఖల మంత్రి గంగుల కమలాకర్ చెప్పారు. సిటీ అభివృద్ధి కోసం విడుదలైన రూ.125 కోట్ల టెండర్ ప్రక్రియ సోమవారం పూర్తవుతుందని, సెప్టెంబర్ 1న పనులు ప్రారంభించి అక్టోబర్ లోగా పూర్తి చేస్తామని వెల్లడించారు. రూ.25 కోట్ల విలువైన పనులకు రిజర్వ్ ఫండ్ ను అందుబాటులో ఉంచుకుంటామని, ఎక్కడ రోడ్డు అడిగితే అక్కడ మంజూరు చేస్తామన్నారు. ఆదివారం కరీంనగర్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో జరిగిన మీడియా సమావేశంలో మేయర్ సునీల్ రావుతో కలిసి మంత్రి మాట్లాడారు. వరంగల్, నిజామాబాద్ లాంటి నగరాలతో పోల్చితే కరీంనగర్ సిటీ ఎంతో సేఫ్ గా ఉందన్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలతో కరీంనగర్ కు ఎలాంటి నష్టం జరగలేదని చెప్పారు.
నగరాన్ని వేల కోట్ల నిధులతో అద్భుతంగా మార్చుకున్నామని అన్నారు. కరీంనగర్, కరీంనగర్ రూరల్, కొత్తపల్లి మండలాల్లో మిగిలిన పనుల కోసం మరో రూ.16.10 కోట్లు మంజూరు అయ్యాయని, వీటితో వంద శాతం పనులు పూర్తవుతాయన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 90కి పైగా సీట్లు గెలిచి మళ్లీ గులాబీ జెండాను ఎగురవేస్తామని, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 13కు 13 సీట్లను బీఆర్ఎస్ స్వీప్ చేస్తుందని మంత్రి ధీమా వ్యక్తం చేశారు. త్వరలో బీఆర్ఎస్ లోకి ఎవరూ ఊహించని స్థాయిలో చేరికలు ఉంటాయన్నారు. తాను ఎమ్మెల్యే కాకముందు 2008లో రికార్డులను పరిశీలించి భూములను కొన్నానని, కానీ అవి వక్ఫ్ భూములు అంటూ కొందరు ఎన్నికల ముందు అసత్య ప్రచారం చేస్తున్నారని మంత్రి మండిపడ్డారు. ఆరోపణలను నిరూపిస్తే 3 ఎకరాల భూమిని ఎక్కువగా ఇస్తానన్నారు. అసత్యాలు ప్రచారం చేస్తున్న వారిపై క్రిమినల్, పరువునష్టం కేసులు వేస్తానన్నారు.