- మహిళ మృతి.. నలుగురికి తీవ్ర గాయాలు
- ఐటీ కారిడార్ రాయదుర్గంలో ప్రమాదం
గచ్చిబౌలి, వెలుగు: ఐటీ కారిడార్ రాయదుర్గంలో ఆదివారం ఉదయం అకస్మాత్తుగా రోడ్డు క్రాస్ చేస్తున్న బైక్ను తప్పించబోయిన ఓ ప్యాసింజర్ ఆటో రోడ్డు పక్కన పార్క్ చేసిన కారును ఢీకొట్టింది. దీంతో ఓ మహిళ చనిపోగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఛత్తీస్‌ఘడ్ లోని చంపా జాగీర్‌కు చెందిన రత్నాబాయి(38), ఈమె భర్త తులసీరామ్(48), బిడ్డ దుర్గేశ్వరి(25) నగరానికి వచ్చి ఫిలింనగర్ అంబేద్కర్ చౌరస్తా వద్ద ఉంటున్నారు. వీరంతా రాయదుర్గంలోని పీడబ్ల్యూసీలో హౌజ్ కీపింగ్ పనిచేస్తున్నారు. ఆదివారం పనికి వెళ్లేందుకు టోలిచౌకీలో ఆటో ఎక్కారు. వీరితో పాటు ఆటోలో షేక్ పేట్ కు చెందిన చంద్రకళ(15) కూడా ఎక్కింది. ట్రాఫిక్ రద్దీ లేకపోవడంతో ఆటో డ్రైవర్ అతివేగంగా డ్రైవ్ చేశాడు.
రాయదుర్గంలోని మల్కం చెరువు సమీపంలోకి వచ్చిన తర్వాత ఫ్లైఓవర్ మీద నుంచి దిగిన టూవీలర్ అకస్మాత్తుగా రోడ్డు క్రాస్ చేయబోయాడు. ఇది చూసిన ఆటో డ్రైవర్ బైక్ను తప్పించబోయి పక్కనే పార్క్ చేసి ఉంచిన కారును ఢీకొట్టి పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదంలో రత్నాబాయి, తులసీరామ్, దుర్గేశ్వరి, చంద్రకళ, టూ వీలర్నడిపిన మహ్మద్ షకీల్ తీవ్రంగా గాయపడ్డారు. వీరిని రాయదుర్గం పోలీసులు దవాఖానకు తరలించగా రత్నాబాయి చనిపోయింది.
తప్పతాగి బ్రేక్‌కు బదులు ఎక్సలేటర్ తొక్కిండు
పంజాగుట్ట: తాగి నిర్లక్ష్యంగా కారు నడపడంతో నాలుగు టూ వీలర్లు ధ్వంసమయ్యాయి. వెంగళరావు నగర్‌కు చెందిన పి.రవి (46) సాప్ట్వేర్ ఎంప్లాయ్. ఆదివారం సాయంత్రం ఉమేశ్‌చంద్ర స్టాచ్యూ నుంచి ఎస్సార్‌నగర్ ట్రాఫిక్ పీఎస్ వైపు కారులో వస్తున్నాడు. యూటర్న్ తీసుకునే టైంలో బ్రేక్‌కు బదులు ఎక్సలేటర్ తొక్కాడు. దాంతో కారు అదుపు తప్పి ఓ షాపువైపు దూసుకుపోయింది. ఈ ఘటనలో షాపు ముందున్న నాలుగు టూ వీలర్లు ధ్వంసమయ్యాయి. ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. కారును పీఎస్ కు తరలించి రవిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సార్నగర్ఇన్స్పెక్టర్ శ్రీనాథ్‌రెడ్డి తెలిపారు.