తెగిన కల్వర్టులకు రిపేర్లు చేసేదెన్నడు?

కామారెడ్డి , వెలుగు:  మూడు నెలల కిందట కురిసిన  వానలకు  జిల్లాలో  రోడ్లు, కల్వర్టులు దెబ్బతిన్నాయి. రోజులు గడుస్తున్నా అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. మాచారెడ్డి మండలం ఎల్లంపేట మైసమమ్మ చెరువు తండా- సోమార్​పేట గ్రామాల మధ్య  కల్వర్టు, రోడ్డు కొట్టుకుపోయింది. 100 మీటర్ల దాక  కోతకు గురై ప్రమాదకరంగా మారింది.  ఈ మార్గం   రోజూ మాచారెడ్డి, ఎల్లంపేట  నుంచి సోమార్​పేట, బంజపల్లి, రత్నగిరిపల్లి,  రాజన్న సిరిసిల్లా జిల్లాలోని ఊర్లకు ఈ మార్గంలో వస్తూ, పోతుంటారు. తాత్కలికంగా రిపేర్లు అయినా చేయించకపోవడంతో స్థానికులు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో పాటు  వరదలకు మాచారెడ్డి, రాజంపేట, గాంధారి, తాడ్వాయి, నాగిరెడ్డిపేట, జుక్కల్​, బిచ్కుంద, కామారెడ్డి మండలాల్లో భారీ వరదలకు రోడ్లు దెబ్బతిన్నాయి.  సుమారు10 కల్వర్టుల వద్ద రోడ్డు కోతకు  గురైంది.  ఆఫీసర్లు వివరాలు సేకరించినా.. ఇప్పటికీ రిపేర్లు మాత్రం చేయలేదు.  

ఇదీ పరిస్థితి..  


రాజంపేట మండలం కొండాపూర్​, గుండారం, ఎల్లారెడ్డిపల్లి శివారుల్లో ఉన్న కల్వర్టులు, కాజ్​వేల దగ్గర కోతకు గురయ్యాయి. కొండాపూర్​- ఎల్లారెడ్డిపల్లి మధ్య ఉన్న కాజ్​వేపై పెద్ద గుంత ఏర్పడింది. మాచారెడ్డి మండలం సోమార్​పేట, బంజపల్లి, రత్నగిరిపల్లిల మధ్య ఉన్న రోడ్డు వరదకు ధ్వంసమైంది. దోమకొండ, ముత్యంపేట, క్యాసంపల్లి మధ్య రోడ్డు దెబ్బతిన్నది.  బిచ్కుంద, జుక్కల్​, మద్నూర్​ మండలాల్లో పలు ఊర్లకు వెళ్లే రోడ్లు, కాజ్​వేలు అధిక వానలకు ప్రమాదకరంగా మారాయి. 

ఈ కల్వర్టు పక్కనుంచి పోవాలంటే భయం

ఎల్లంపేట నుంచి సోమార్​పేట వైపు వెళ్లే రోడ్డులో కల్వర్టు వానలకు సగం కొట్టుకుపోయింది. రోడ్డు కూడా సగం కోస్కపోయింది.  ఇప్పటి వరకు రిపేర్​ చేయలేదు. ఆ రోడ్డు నుంచి వెహికల్​పై వెళ్ళాలంటే భయమవుతోంది.  బస్సు కూడా బంద్​ చేసిండ్రు. 

- సురేశ్​, ఎల్లంపేట 

రాత్రి టైం అయితే ప్రమాదమే

ఎల్లంపేట నుంచి సోమార్​పేట వచ్చే రోడ్డులో వానలకు కల్వర్టు కొట్టుకుపోయి పైపులు పైకి లేచాయి. పగలు, రాత్రి టైంలో కొత్తవాళ్లు ఎవరైనా బైక్​లు, కార్లపై వస్తే యాక్సిడెంట్​ జరిగేలా ఉంది. అంచుకు వెహికిల్స్​ పోకుండా కనీసం బోర్డు కూడా పెట్టలేదు. వానలు పోయినా ఇంకా రిపేర్​ చేస్తలేరు.
- నారాయణ, సోమార్​పేట