చేతులు దులుపుకుంటున్న కాంట్రాక్టర్లు .. రిపేర్లు చేయట్లే రోడ్లు వేయట్లే

చేతులు దులుపుకుంటున్న  కాంట్రాక్టర్లు ..   రిపేర్లు చేయట్లే రోడ్లు వేయట్లే

హైదరాబాద్, వెలుగు :  గ్రేటర్ ​పరిధిలోని రోడ్లను వివిధ పనుల కోసం తవ్వి అలాగే వదిలేస్తున్నారు. తిరిగి రిపేర్లు చేయడంలేదు. అవసరమైన చోట కొత్తగా రోడ్లు వేయడం లేదు. వాటర్​బోర్డుతో పాటు పలు కేబుల్స్​పనుల కోసం రోడ్లను తవ్వేస్తున్న కాంట్రాక్టర్లు మట్టితో పూడ్చేసి చేతులు దులుపుకుంటున్నారు. వాటి మీదుగా వెహికల్స్​వెళ్తున్న టైంలో దుమ్ము రేగుతోంది. హెవీ వెహికల్స్​దిగబడుతున్నాయి. వెహికల్స్​గుంతల్లో ఇరుక్కుపోయిన టైంలో ట్రాఫిక్​సమస్య తలెత్తుతోంది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు మొదలైన వాటర్​బోర్డు పనులు చాలాచోట్ల నెలల తరబడి కొనసాగుతున్నాయి. పెద్ద ఎత్తున రోడ్ల తవ్వకాలు జరుగుతున్నాయి.

రోడ్డు తవ్వే ముందు బల్దియా నుంచి తప్పనిసరిగా ఎన్ఓసీ తీసుకోవాలనే నిబంధన కాగితాలకే పరిమవుతోంది. ఎటువంటి అనుమతులు తీసుకోకుండానే కాంట్రాక్టర్లు అడ్డగోలుగా రోడ్లు తవ్వుతున్నారు. కొన్నిచోట్ల రాత్రికిరాత్రి తవ్వి పనులు చేసేస్తున్నారు. గల్లీల్లో రోడ్లు చిన్నగా ఉండడం, తవ్వేసిన రోడ్లను తిరిగి నిర్మించకపోవడంతో రోజంతా వెహికల్స్​మూవ్​మెంట్ నెమ్మదిగా సాగుతోంది. కొన్నిచోట్ల యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. ఎన్ఓసీలు తీసుకోకపోయినా బల్దియా అధికారులు పట్టించుకోవడం లేదు. సిటీలోని కొన్ని ప్రాంతాల్లో జీహెచ్ఎంసీ వైట్ ట్యాపింగ్​రోడ్లు నిర్మించింది. ఈ రోడ్లు వేసే ముందు అక్కడ దాదాపు ఐదేండ్ల పాటు తవ్వకుండా ఉండేలా అన్ని రకాల చర్యలు తీసుకుంది. కానీ వాటిని కూడా వివిధ పనుల పేరుతో తవ్వేస్తున్నారు.

దారుణంగా అంతర్గత రోడ్లు

మెయిన్​రోడ్ల నుంచి కాలనీలకు వెళ్లే రోడ్లను ఏదో ఒక పని పేరుతో కాంట్రాక్టర్లు తవ్వుతూనే ఉన్నారు. ఖైరతాబాద్, చార్మినార్, శేరిలింగంపల్లి జోన్ల పరిధిలో రోడ్లు తవ్వేసి  రోజులు గడిచినా రిపేర్లు చేయడం లేదు. గ్రేటర్​లో 9,013 కిలోమీటర్ల మేర రోడ్లు విస్తరించి ఉండగా, 2,846 కి.మీ మేర బీటీ రోడ్లు, 6,167 కి.మీ మేర అంతర్గత సీసీ రోడ్లు ఉన్నాయి. అయితే ప్రస్తుతం ఈ రోడ్లన్నీ దారుణంగా ఉన్నాయి. దాదాపు 200 కిలోమీటర్ల మేర డ్యామేజ్ అయ్యాయి. ఎవరికి ఇష్టమొచ్చినట్లు వాళ్లు తవ్వుకుంటూ పోతున్నారు. బల్దియా అధికారులకు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోవడం లేదని జనం మండిపడుతున్నారు.

కో ఆర్డినేషన్ లేకనే..

గ్రేటర్ ​రోడ్లపై ఎలాంటి పనులు చేపట్టాలన్నా సంబంధిత డిపార్ట్​మెంట్ల నుంచి ఎన్ఓసీలు తీసుకోవాల్సి ఉంది. అయితే వాటర్ బోర్డు, జీహెచ్ఎంసీల మధ్య కోఆర్డినేషన్ లేక రోడ్లు అస్తవ్యస్తంగా మారాయని జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పనులు పూర్తయ్యాక తిరిగి రోడ్లు వేసే బాధ్యత సదరు కాంట్రాక్టర్ పైనే ఉంటుంది. ఒకవేళ కాంట్రాక్టర్ రోడ్లు వేయకపోతే ఆ పనికి సంబంధించి బిల్లులు ఆపేసే అధికారం ఆయా డిపార్ట్​మెంట్ల ఆఫీసర్లకు ఉంటుంది. ఈ విషయాన్ని అధికారులు పట్టించుకోవడం లేదు. ఇదే అలుసుగా కాంట్రాక్టర్లు రోడ్లు బాగు చేయకుండానే చేతులు దులుపుకుంటున్నారు. కొందరు కాంట్రాక్టర్లు ఎన్ఓసీలు తీసుకోకుండా రాత్రికి రాత్రే పనులు కానిచ్చేస్తున్నారు. కొన్ని పనుల జరిగినట్లు, జీహెచ్ఎంసీ ఏఈలు, ఈఈలకు కూడా తెలియడం లేదు. రోడ్లు బాగుచేయాలంటూ బల్దియా అధికారులకు రోజూ ఫిర్యాదులు అందుతున్నాయి.