
- ఆదివాసీల గురించి పట్టించుకోని ప్రభుత్వాలు
- ‘శతర ఆదివాసీ కవిత్వం’ ఆవిష్కరణ
బషీర్‌బాగ్, వెలుగు: సిరికి స్వామినాయుడు రచించిన ‘శతర ఆదివాసీ కవిత్వం’ పుస్తకాన్ని ఆదివారం హైదరాబాద్ బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి.సుదర్శన్ రెడ్డి ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ పాలకులు ఆదివాసీల గురించి పట్టించుకోవడం లేదని, అటవీ ప్రాంతంలోని ఖనిజ సంపదను దోచుకోవడానికే రోడ్లు వేశారని ఆరోపించారు.
సిరికి స్వామినాయుడు టీచర్‌గా కొనసాగుతూనే గిరిజనుల కోసం అద్భుతమైన కవిత్వాన్ని రాశారన్నారు. ప్రముఖ జర్నలిస్టు కె. శ్రీనివాస్ మాట్లాడుతూ పాలకులు అటవీ సంపదను ధ్వంసం చేస్తున్నారని, సైనికులతో భౌతికదాడులకు పాల్పడుతున్నారని, గిరిజనులను బానిసత్వానికి గురిచేస్తున్నారని ఆరోపించారు. ఆదివాసీలను, వారి సంస్కృతిని నాశనం చేస్తున్నారన్నారు. ప్రముఖ కవి ప్రొఫెసర్ జయధీర్ తిరుమలరావు మాట్లాడుతూ ప్రజాస్వామ్యానికి అవనరమైన సాహిత్యాన్ని కవులు, రచయితలు అందించాలన్నారు. ప్రస్తుతం ఆదివాసీలు సంక్షోభంలో ఉన్నారని విచారం వ్యక్తం చేశారు. సభకు అట్టాడ అప్పలనాయుడు అధ్యక్షత వహించగా, ప్రొఫెసర్ జి.మనోజ్, ప్రముఖ రచయిత్రి దాసోజు లలిత, ప్రొఫెసర్ జి. మనోజ, సిరికి స్వామినాయుడు ప్రసంగించారు.