గ్రేటర్‌‌లో అడుగుకో గుంత

  • నగరంలో ఎక్కడ చూసినా రోడ్లు అధ్వానం 
  • దాదాపు వెయ్యి కిలోమీటర్ల  మేర దెబ్బతిన్న రోడ్లు 
  • పాట్ హోల్స్ కూడా పూడ్చని బల్దియా  
  • పనుల కోసం ఇష్టమున్నట్టు  తవ్వి రిపేర్లు చేయని కాంట్రాక్టర్లు  
  • యాక్షన్​తీసుకోని బల్దియా

హైదరాబాద్ సిటీ, వెలుగు : గ్రేటర్ లో ఎక్కడ చూసినా రోడ్లు గుంతలమయమై కనిపిస్తున్నాయి. అడుగుకో గుంత ఏర్పడడంతో వాహనదారులు చుక్కలు చూస్తున్నారు. వర్షాలు పడ్డప్పుడు రోడ్లపై గుంతలు ఏర్పడడం సహజమే అయినా ఇప్పుడు వర్షాలు లేకున్నా అదే పరిస్థితి ఉంది. ఈ ఏడాది ఆగస్టులో వర్షాలు పడ్డప్పుడు చాలా చోట్ల రోడ్లు దెబ్బతిన్నాయి. చాలా చోట్ల అప్పటి నుంచి రోడ్లు వేయకపోవడం, కనీసం పాట్ హోల్స్ కూడా పూడ్చకపోవడంతో రోడ్ల దుస్థితి ఇంకా అధ్వానంగా తయారైంది. ఇంకోవైపు వివిధ డిపార్ట్​మెంట్లకు చెందిన కాంట్రాక్టర్లు కరెంట్, వాటర్ వర్క్స్, డ్రైనేజీ, కేబుల్ పనుల కోసం రోడ్లను తవ్వి మళ్లీ వేయకపోవడంతో తిప్పలు తప్పడం లేదు. 

వెయ్యి కిలోమీటర్ల మేర డ్యామేజ్​

బల్దియా పరిధిలో 9013 కిలోమీటర్ల రోడ్లుండగా, 2846 కిలోమీటర్ల బీటీ రోడ్లు, 6167 కిలోమీటర్ల పరిధిలో ఇంటర్నల్​సీసీ రోడ్లున్నాయి. ఈ రోడ్లపై సుమారు వెయ్యి కిలోమీటర్ల మేర రోడ్లు తీవ్రంగా దెబ్బతిన్నా అధికారులు స్పందించడం లేదు. అడిగితే ‘రోడ్లన్నీ బాగానే ఉన్నాయి. ఇబ్బందేమీ లేదు’ అని సమాధానం ఇస్తున్నారు. వాస్తవానికి ఇండియన్​రోడ్​కాంగ్రెస్​ప్రకారం బీటీ రోడ్డు వేస్తే ఆరేండ్ల వరకు, సీసీ రోడ్డయితే పదేండ్ల వరకు పటిష్టంగా ఉండాలి. కానీ, ఇప్పుడు వేసిన రోడ్లు నెలల వ్యవధిలోనే దెబ్బతింటున్నాయి. 

ఎమ్మెల్యేల ఫిర్యాదులు 

తమ నియోజకవర్గాల్లో దెబ్బ తిన్న రోడ్లను రిపేర్​చేయాలని, కొత్త రోడ్లు వేయాలని ఎమ్మెల్యేలు బల్దియా అధికారులను కోరుతున్నారు. తన నియోజకవర్గంలో లెక్కలెనన్ని పాట్ హోల్స్ ఉన్నాయని, అర్జెంట్‌గా పనులు చేయాలని ఖైరతాబాద్ జోనల్ కమిషనర్‌‌కు కార్వాన్ ఎమ్మెల్యే కౌసర్ మొహియుద్దీన్ ఈ నెల 11న వినతిపత్రం ఇచ్చారు.  మిగతా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు రోడ్ల సమస్యను అధికారుల దృష్టికి తీసుకువెళ్తున్నా స్పందన కనిపించడం లేదు. 

ఎన్వోసీ లేకుండానే తవ్వకాలు 

గ్రేటర్ రోడ్లను తవ్వాలన్నా, ఎలాంటి పనులు చేయాలన్నా ఎన్​వోసీలు తీసుకోవాల్సి ఉంది. పనులు పూర్తయిన తర్వాత రోడ్లు వేసే బాధ్యత కాంట్రాక్టర్‌‌దే. ఒకవేళ కాంట్రాక్టర్ ఆ పని చేయకపోతే ఆ పని బిల్లులు ఆపే అధికారం ఆఫీసర్లకు ఉంటుంది.  కానీ ఇలా ఎక్కడా జరగడం లేదు.  కొన్ని చోట్లయితే అసలు పర్మిషన్​అనేదే తీసుకోకుండా రాత్రికి రాత్రే తవ్వి పని చేసుకొని పోతున్నారు.  దీంతో వెహికిల్స్​మూవ్ మెంట్ స్లో అయి ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్​జామ్స్​ఏర్పడుతున్నాయి.  కొన్ని ప్రాంతాల్లో యాక్సిడెంట్లు జరుగుతున్నాయి.  

సర్వీస్​ఎక్కువగా ఉంటుందని కొన్ని ప్రాంతాల్లో బల్దియా వైట్​ట్యాపింగ్​రోడ్లు వేసింది.  ఈ రోడ్లు వేసే ముందు అక్కడ ఐదేండ్ల పాటు రోడ్లను తవ్వకుండా చర్యలు తీసుకోవాలి. కానీ ఈ రోడ్లను కూడా పనుల కోసం తవ్వేస్తున్నారు.  కొన్ని పనుల విషయమైతే జీహెచ్ఎంసీ ఏఈలు, ఈఈలకు కూడా తెలియడం లేదు.

ఒక్కటా.. రెండా.. ఎన్నో చోట్ల..

మెయిన్​రోడ్ల నుంచి కాలనీలకు వెళ్లే రోడ్లను రోజూ ఏదో ఒక పని పేరుతో కాంట్రాక్టర్లు తవ్వుతూనే ఉన్నారు.  ఖైరతాబాద్, చార్మినార్, శేరిలింగంపల్లి జోన్ల పరిధిలో రోడ్లు తవ్వి రోజులు గడుస్తున్నా రిపేర్​చేయడం లేదు.  మెహిదీపట్నంలో మెయిన్​రోడ్డుపై ఎలక్ర్టిసిటీ పనుల కోసం రోడ్డు తవ్వినా తిరిగి వేయలేదు. దీంతో అక్కడ భారీగా ట్రాఫిక్ జామవుతోంది.  టోలిచౌకి ఫ్లైఓవర్ కింద పనులు చేసి నెలలు గడిచినా మళ్లీ పునరుద్ధరించలేదు. 

ALSO READ : మెట్రో మలుపు..గుండెల్లో కుదుపు..పలు రూట్ల​లో క్రాసింగ్స్​ వద్ద భరించలేని శబ్ధం

అంబర్ పేట్ ఫ్లైఓవర్ పనుల కారణంగా నాలుగేండ్లుగా ఇక్కడ రోడ్డు బ్లాక్ చేయడంతో 6  నెంబర్ వైపు వెళ్లే వాహనదారులు రెడ్ బిల్డింగ్ రోడ్డు మీదుగా ప్రయాణిస్తున్నారు. దీంతో ఈ రోడ్డు కిలోమీటర్ మేర పూర్తిగా గుంతలమయమైంది. అలాగే, రేతిబౌలి మెయిన్​రోడ్డుపై, టోలిచౌకి మెయిన్​రోడ్డుపై కూడా గుంతలు ఏర్పడ్గాయి. దాదాపు అంతర్గత రోడ్లన్నీ ధ్వంసమై కనిపిస్తున్నాయి. షేక్ పేట్ ఫ్లైఓవర్ సమీపంలో రోడ్డుపై పూర్తిగా గుంతలు ఏర్పడ్డాయి. విజయ్ నగర్ కాలనీ, కూకట్ పల్లి, బాలానగర్, జీడిమెట్ల ఇలా అన్ని ప్రాంతాల్లో పాట్ హోల్స్ ఉన్నాయి.